పంతానికి పోవ‌ద్దు.. త‌ల‌సాని

ఇరువైపులా స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌పుడు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవడం మేలు. కానీ తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి, తెలుగు ఫిలిం ఫెడ‌రేష‌న్ మ‌ధ్య వివాదం ముదిరింది. ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇరువైపుల పెద్దలతో మ‌ట్లాడి పంతాల‌కు పోయి స‌మ‌స్య‌ను మ‌రింత పెద్ద‌ది చేసుకోవ‌ద్ద‌ని న‌చ్చ‌జెప్పారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంతాలు, పట్టింపులు వద్దని చెప్పానని పేర్కొన్నారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కార్మికులకు సమస్యలు ఉన్నాయని.. కరోనాతో వేతనాలు పెరగలేదన్నారు. ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలంటే.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.

సినీరంగంలో ప‌నిచేసే 20 వేల‌కు మించి వున్న కార్మికులు త‌మ జీత‌ భత్యాలు పెంచాల‌న్న‌డిమాండ్‌తో స‌మ్మెకు దిగారు. బుధ‌వారం అనేక‌మంది సినీ కార్మికులు హైదార‌బాద్ జూబ్లీ హిల్స్‌లోని సినీ ఫెడ‌రేష‌న్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించి త‌మ వేత‌నాల‌ను 45 శాతం పెంచాల‌ని డిమాండ్ చేస్తూభారీ నినాదాల‌తో హోరెత్తించారు. అయితే ఫెడ‌రేష‌న్‌, సినీ నిర్మాత‌ల మండ‌లి స‌మావేశంలోనే అది నిర్ణ‌యించే అవ‌కాశం వుంద‌ని, ప్ర‌స్తుతం 30 శాతం మేర‌కు పెంచ‌డానికి అవ‌కాశం వుంటుంద‌ని ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వారికి న‌చ్చ‌జెప్పారు. కానీ అది వెంట‌నే అమ‌లు అవుతుంద‌న్న‌ది  స్ప‌ష్టం చేయ‌లేదు.

కోవిడ్‌-19 కార‌ణంగా సినీ కార్మికులు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నామ‌ని ఈ ప‌రిస్థితుల్లో వేత‌నాల‌ను పెంచాల్సిన అవ‌స‌రం వుంద‌ని వారు గ‌త ఆరు నెల‌లుగా డిమాండ్ చేస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల గురించి  తెలుగు ఫిలిమ్‌ఛాంబ‌ర్ తో చ‌ర్చిస్తున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
కార్మికుల సమ్మె వల్ల సుమారు 20 చిత్రాల నిర్మాణం నిలిచిపోయింది.  అయితే  కార్మికులు స‌మ్మెకు దిగ‌డం స‌మంజ‌సం కాద‌ని, స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవ‌డానికే మొగ్గు చూపాల‌ని సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కార్మికుల‌ను కోరారు.  స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించడానికి  ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి త‌ల సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం  చేయ‌డానికి ముందుకు వచ్చారు.