స్వచ్ భారత్‌లో అనుకోని అతిథి...చిన్నారుల ఆనందం
posted on Oct 18, 2025 3:17PM

రాష్ట్ర వ్యాప్తంగా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రహసనంలా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ శనివారం నాడు జరిగిన కార్యక్రమం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది.
శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో పర్యటిస్తున్న సమయంలో నౌతల కూడలి లో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛంద్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది.
వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నినదిస్తూ.. సైకిళ్లలతో చిన్నారులు ర్యాలీ చేపట్టడం అక్కడి వారిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు. మంచి కార్యక్రమం చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ప్రతీ ఒక్క చిన్నారి మొక్కలను కూడా నాటాలని కోరారు. సమాజ హితం కోసం చిన్నారులు చేస్తున్న ఈ కార్యక్రమంలో అనుకోని అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రావడంతో ఆ చిన్నారులు ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు.