ఆశారాం బాపూకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన సుప్రీం
posted on Jan 8, 2025 9:22AM

అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వయం ప్రకటిత దేవుడు ఆశారాం కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. 86 ఏళ్ల ఆశారాంబాపూ తన 77 ఏళ్ల భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో ఉన్నారనీ, ఆమెకు బైపాస్ ఆపరేషన్ చేయించాల్సి ఉందనీ పేర్కొంటూ బెయిలు కోసం చేసిన విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనకు మార్చి 31వరకూ తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. ఈ బెయిలు సమయంలో ఆయన తన అనుచరులను కలవకూడదని షరతు విధించింది.
గాంధీనగర్ సమీపంలోని తన ఆశ్రమంలో 2013 జరిగిన అత్యాచార కేసులో ఆశారాంబాపు నిందితుడు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు ఆశారాం బాపు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ చేసిన ఆరోపణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
2023 జనవరిలో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగిలినవారికి వారిని విడుదల చేశారు. 2023లో జీవిత ఖైదును సస్పెండ్ చేయాలంటూ ఆశారాం బాపు వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు గత ఏడాది ఆగస్టులో తిరస్కరించింది. ప్రస్తుతం ఆశారం బాపు జోధ్ పూర్ జైలులో ఉన్నారు. ఆయన కుమారుడు నారాయణ్ సాయిపై కూడా అత్యాచారం కేసు నమోదైంది. ఆ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నారాయణ్ సాయి ప్రస్తుతం అతడు సూరత్ జైలులో ఉన్నాడు.