మ‌ళ్లీ బ‌ట‌న్‌ నొక్కిన జ‌గ‌న‌న్న‌.. ‘సుప్రీం’ వ‌ద్ద‌న్నా ఆగేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ‌ళ్లీ మీట నొక్కారు. ఇంచుమించుగా నాలుగు లక్షల (3,92,674)  మంది ఈబీసీ నేస్తం పథకం లబ్దిదారుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయల చేరిపోయాయి. ఇదొక్కటే కాదు, ఇలా ముఖ్యమంత్రి మీట నొక్కటం అలా లబ్దిదారు ఖాతాల్లోకి డబ్బులు చేరిపోవడం ఒక రొటీన్ వ్యవహరంగా సాగిపోతోంది. మంచిదే, కానీ, పేదలను పెదలుగా ఉంచుతూ, ఓటు బ్యాంకు కోసంగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమిటన్న ప్రశ్నతో పాటుగా, ఇంకా అనేక ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.   

ముఖ్యమంత్రి అలా మీట నొక్కిన రోజునే, సుప్రీం కోర్టు, ఉచితాలకు సంబందించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అఫ్కోర్స్ ఇది యాదృచ్చికమే కావచ్చును, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈబీసీ నేస్తం పథకం గురించో, లేక పోతే ఇతర సంక్షేమ పథకాల గురించో కాకపోవచ్చును. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా, రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల గురించే కావచ్చును. కానీ, దేశ వ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలను , ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీరమణ. ‘చట్ట వ్యతిరేక’ వ్యవహారంగా పేర్కొన్నారు.ఉచిత హామీలతో ఎన్నికలు ప్రభావితమవడమే కాకుండా, ఎన్నికల్లో పారదర్శకత కూడా లోపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు 

ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింప చేయాలని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని బీజపీ నేత, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయవాదులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్  హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్, కేంద్రంపై సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తపరిచింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత హామీలు తీవ్రమైన అంశమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, “ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఎలా అదుపు చేయాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోపే ఇది చేయగలమా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? ఇది చాలా తీవ్రమైన అంశం. ఉచిత హామీల బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్‌ను మించిపోతోంది'' అని పేర్కొన్నారు. 

ఓటర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇంత చేసి తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.నిజానికి, ఇప్పటి నుంచి నాలుగు వారాలకు అంటే ఐదు  రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరాఖరి ఘట్టానికి  చేరుకుంతుంది. ఇక ఆ దశలో సుప్రీం కోర్టు ఎంత కఠిన తీర్పు ఇచ్చినా అమలవడం అనుమానమే. అదీగాక అప్పటికైనా తీర్పు వస్తుందని ఆశించలేము. అందుకే, ఇలాంటి విషయాల్లో రోజువారీ విచారణ చేపట్టి అయినా శీఘ్రంగా తీర్పు వెలువరించాలని అంటున్నారు. 

అదొకటి అలా ఉంటే, ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. చాలా కాలంగా, ‘ఎన్నికల తాయిలాల’ పై చర్చ జరుగుతూనే వుంది. అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడంపై 2013లోనే సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. అంటే, ఉచిత వరాలు ఎంత ప్రమాదకరంగా పరిణమించాయని న్యాయస్థానం భావిస్తోందో వేరేచెప్ప నక్కర లేదు.  

అయినా, ఎన్నిక ఎన్నికకు ఉచిత వరాల వరద పెరుగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం అయితే, అదుపు తప్పి అప్పులు చేసి మరీ ఉచిత పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఉన్నదే అందుకు అన్నట్లుగా వ్యవహరించి, పేదలను పేదలుగా ఉంచేందుకు, ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకునేందుకు నిరంతర ప్రయత్నం సాగిస్తోంది. అనకూడదో ఏమో కానీ, ప్రజలను  బిచ్చగాళ్ళుగా మార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం  ప్రయత్నిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కాగా పిటీషనర్ న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తమ పిటీషన్’లో ఇలాంటి ఉచిత హామీలను గతంలోనూ కోర్టు ఎన్నో చూసిందని, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే రాజకీయ పార్టీలు ఎన్నెన్నో ఉచిత హామీలను ఇస్తున్నాయని తెలిపారు. ఉచిత హామీల కారణంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని పిటిషనర్ తెలిపారు. దీంతో రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిపై రూ.3 లక్షల రుణభారం పడిందని చెప్పారు.అయితే, ప్రజలలో మార్పు రాకుండా, న్యాయస్థానాల తీర్పుల  వల్లనో , ప్రభుత్వ చట్టాల వల్లనో ప్రయోజనం ఆశించలేమని విశ్లేషకులు అంటున్నారు.