బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సాల్

బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కమలం పార్టీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ గా తరుణ్ చుగ్ స్థానంలో సునీల్ బన్సాల్ ను నియమించింది.

బుధవారం(ఆగస్టు11) ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో బలోపేతం అయ్యే లక్ష్యంతో సాగుతున్న బీజేపీ ఆ లక్ష్య సాధనలో భాగంగానే సునీల్ బన్సాల్ ను నియమించింది. ఇప్పటి వరకూ ఆయన ఉత్తర ప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు జాతీయ కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించింది.

సునీల్ బన్సాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితులు.  ఇప్పటికే తెలంగాణలో   దుబ్బాక, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ  విజయం సాధించింది.

ఇప్పుడు  మనుగోడులో విజయం సాధించి ముచ్చటగా మూడో ఉప ఎన్నికలో విజయాన్ని కూడా ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 21న మునుగోడులో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.