Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పింఛన్ డబ్బుల కోసం...90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ.మోసుకెళ్లిన కోడలు
posted on: May 24, 2026 10:19AM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుర్గుజా జిల్లా మెయిన్‌పాట్ పరిధిలోని కునియా జంగల్‌పారా గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సోన్‌వారి (90) అనే వృద్ధురాలికి ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛనే జీవనాధారం. అయితే గత మూడు నెలలుగా ఆమెకు పింఛన్ డబ్బులు అందలేదు. దీనితో ఆమె కోడలు, 55 ఏళ్ల సుఖ్మణియా, తప్పనిసరి పరిస్థితుల్లో తన అత్తగారిని వీపుపై ఎక్కించుకుని అడవి దారుల గుండా సుమారు ఐదు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు నడుచుకుంటూ తీసుకువెళ్లింది.
గతంలో 'బ్యాంక్ మిత్ర' ప్రతినిధి నేరుగా ఇంటికే వచ్చి పింఛన్ డబ్బులు అందజేసేవారని బాధితురాలు తెలిపింది. అయితే, కేవైసీ (KYC) ప్రక్రియ నిలిచిపోవడంతో గత మూడు నెలలుగా ఆ సేవలు నిలిచిపోయాయి. బ్యాంకుకు వెళ్తే తప్ప సమస్య పరిష్కారం కాదని తెలియడంతో, నడవలేని స్థితిలో ఉన్న అత్తగారిని కోడలు అంతదూరం మోసుకుపోవాల్సి వచ్చింది. బ్యాంకుకు చేరుకున్నాక అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ. 1500 నగదును తక్షణమే విడుదల చేశారు.
ఈ హృదయవిదారక దృశ్యాలను స్థానికులు కొందరు సామాజిక మాధ్యమాలలో పంచుకోవడంతో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిజిటల్ బ్యాంకింగ్, ఇంటివద్దకే సేవలంటూ ప్రగల్భాలు పలికే పాలకులు.. క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంతాల్లోని ఇలాంటి నిస్సహాయులను పట్టించుకోకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మానవత్వంతో అత్తను తల్లిలా సాకిన కోడలిపై ప్రశంసలు కురుస్తుండగా, వ్యవస్థ వైఫల్యంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.ఈ విషయంపై బ్యాంక్ ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు.
ఈ సమస్యను తమ దృష్టికి ముందే తీసుకువచ్చి ఉంటే తామే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవారమని సమర్థించుకున్నారు. భవిష్యత్తులో సదరు వృద్ధురాలికి ఇలాంటి కష్టాలు రాకుండా 'బ్యాంక్ మిత్ర' ద్వారా నేరుగా ఇంటికే పింఛన్ డబ్బులు పంపిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు మరియు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయాలని ప్రజలు మరియు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.






