ఇప్ప‌టికీ అమ‌రావ‌తినే టాప్‌.. దేశంలో చెక్కుచెద‌ర‌ని రికార్డ్‌..

అమ‌రావ‌తి. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని. అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రం. సీఎం చంద్ర‌బాబు త‌ల‌పెట్టిన కార్యం. స్వ‌యంగా దేశ ప్ర‌ధాని మోదీనే త‌ర‌లివ‌చ్చి శంకుస్థాప‌న చేసిన ప్రాంతం. చంద్ర‌బాబు సీఎంగా ఉండిఉంటే.. ఇప్ప‌టిక‌ల్లా అమ‌రావ‌తికి ఓ రూపం వ‌చ్చి ఉండేది. ఆకాశ హ‌ర్మాల‌తో ఏపీ రాజ‌ధాని వెలుగొందుతూ ఉండేది. ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న్ అమ‌రావ‌తిని స్మ‌శానంలా మార్చేశారు. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేశారు. ఆంధ్రుల క‌ల‌ల సౌధాన్ని కుప్ప‌కూల్చేశారు. ఆఖ‌రికి అమ‌రావ‌తి రోడ్ల‌ను త‌వ్వుకొని కంక‌ర‌, ఇసుక ఎత్తుకెళ్లే స్థాయికి ఏపీ రాజ‌ధానిని దిగ‌జార్చారు. సీఎం జ‌గ‌న్ రాజ‌ధానితో ఎంత‌లా ఆడుకుంటున్నా.. అమ‌రావ‌తి ప్ర‌భ‌ను మాత్రం మ‌స‌క‌బార్చ‌లేక‌పోయారు. ఇప్ప‌టికీ ఓ విష‌యంలో అమ‌రావ‌తి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గానే ఉంది. ఆంధ్రుల నిండు గౌర‌వం సృష్టించిన రికార్డు ఇంకా ప‌దిలంగానే ఉంది. 

మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణలో అమరావతి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సిటీ డెవలప్‌మెంట్ జారీ చేసిన రూ.2వేల కోట్ల బాండ్లను మరే నగరం దాటలేకపోయింది. 2018-19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది నగరాలు/ పట్టణాభివృద్ధి సంస్థలు నిధుల సమీకరణకు బాండ్లను జారీ చేశాయి. మొత్తం రూ. 8,840 కోట్లు సేకరించాయి. ఇవేవీ అమరావతి స్థాయిలో నిధులు రాబ‌ట్ట‌లేక‌పోయాయి. 

2018లో అప్పటి ప్రభుత్వం రూ.2వేల కోట్లకు బాండ్లను జారీచేయగా.. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమరావతి బ్రాండ్‌కు మంచి గుర్తింపు దక్కింది. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని న‌మ్మి.. అమ‌రావ‌తి మోడ‌ల్‌ను విశ్వ‌సించి.. ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన బ్రాండ్ల‌ను ఎగ‌బ‌డి కొన్నారు. అదంతా అమ‌రావతికి ద‌క్కిన గౌర‌వం. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికి నిద‌ర్శ‌నం. ఆ రికార్డు ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌కుండా అలానే ఉంది. ఇటీవ‌ల లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన‌ ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.