మాటలకందని విషాదం..తిరుపతిలో తొక్కిసలాట..ఆరుగురు మృతి
posted on Jan 9, 2025 6:12AM
.webp)
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ విషాదం చోటు చేసుకుంది. వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ దర్శనాల కోసం గురువారం (జనవరి 9) నుంచి తిరుమల, తిరుపతిలో టోకెన్ల జారీకి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా ఈ కేంద్రాల వద్దకు భక్తులు బుధవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి అందుతున్న వైద్య సేవలపై అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
కాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించడంపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని, బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇలా ఉండగా తిరుపతి తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.