సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ
posted on Oct 22, 2025 7:05PM

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో నిందితులు డాక్టర్ నమ్రత తోపాటు కళ్యాణి, సంతోషిని, నందినిని చంచల్ గూడ మహిళ జైలులో ఈడీ అధికారులు విచారించారు. సృష్టి కేసు వెలుగులోకి రావడంతో ఈడి అధికారులు రంగం లోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పురు షుల జైల్లో ఉన్న డాక్టర్ నమ్రత కుమారుడు జయంతి కృష్ణ ను కూడా విచారిస్తున్నారు. ఈ కేసు లో పెద్ద మొత్తంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లుగా ఈడి అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి ఫెర్టిలిటీ వ్యవహా రానికి సంబంధించి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు... డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో పెద్ద ఎత్తున అక్రమా లకు పాల్పడినట్లుగా ఈడి అధికారులు గుర్తించారు.
డాక్టర్ నమ్రత ఆర్థిక పరిస్థితి బాగాలేని వారిని టార్గెట్ చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి.... పిల్లల్ని కొనుగోలు చేసేది. అనంతరం తన వద్దకు సరోగసితో పిల్లలు కావాలని వచ్చేవారిని నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు తీసు కుంటూ.... అప్పుడే పుట్టిన శిశువులను వారికి ఇచ్చి..మీ బిడ్డే అంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడింది...డిఎన్ఏ టెస్ట్‌లో తమ బిడ్డ కాదని తెలిసిన వెంటనే దంపతులు నిలదీసి అడగడంతో డాక్టర్ నమ్రత తన కొడుకు లాయర్ జయంతి కృష్ణతో కలిసి బెదిరింపులకు గురి చేసేది.
దీంతో సరోగసి పేరుతో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగింది. అయితే ఓ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ నమ్రత వ్యవహార మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకు మరియు కళ్యాణి నందిని, సంతోషి వారందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.. అయితే ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న వీరందరినీ ఈడి అధికారులు విచారిస్తున్నారు. వీరందరిని ఈడీ అధికారులు ఈనెల 28వ తేదీ వరకు విచారణ చేయనున్నారు.