నేరం మాది కాదు ఉడుతది.. విద్యుత్ అధికారుల వినూత్న కథనం

ఆంధ్రప్రదేశ్ లో కనీవినీ ఎరుగని అద్భుతాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో ఎలుకలు, పిచ్చుకలు, తేనెటీగలు, ఆఖరికి ఉడుతలు కూడా రికార్డులు సృష్టించేస్తున్నాయి. జనం ప్రాణాలు తీయడానికి, సమాజంలో ఆశాంతిని నింపడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. చివరికి దొంగలు కూడా అధికార పార్టీ నేతలను కాపాడటానికి సాక్ష్యాలను మాయం చేయడానికి కోర్టుల్లో చోరీలు చేసి మరీ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇలాంటి సంఘటలను కల్పించి కథలలల్లడంలో ఏపీ అధికారులు ఆరితేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు కథలల్లడంలో నభూతో.. న భవిష్యత్ అన్నంత సృజనాత్మకత కనబరుస్తున్నారు. సన్నివేశాల కల్పనలో సినీ దర్శకులను మించి పోతున్నారు.

సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపడి మహిళా కూలీలు మరణించడానికి కారణం ఉడుతలంటూ అధకారులు చెబుతున్నారు. గతంలో నెల్లూరు కోర్టులో దొంగలు పడి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాల బ్యాగును మాత్రమే చోరీ చేశారని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ దొంగలు కాకాణికి మంత్రి పదవి వచ్చిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను మాత్రమే చోరీ చేశారు. ఇంతకీ ఆ సాక్ష్యాలు ఏమిటంటే..  సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని 2017లో కాకాణి ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా బయటపెట్టారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి.. నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కాకాణి బయటపెట్టినవి నకిలీ పత్రాలుగా గుర్తించి చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కాకాణినిని ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే, ఆ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్‌ను ఎ-2గా పేర్కొన్నారు.  ఈ కేసు నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉండగా.. కాకాణికి మంత్రి పదవి వచ్చింది. అదే రోజు  రాత్రి కోర్టులోకి చొరబడిన దొంగలు ఆ కేసుకు సంబంధించి భద్రపరిచిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు.  

నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో జరిగిన చోరీ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  అప్పుడు పోలీసులు చెప్పిన కథ ఇది. ఇనుము దొంగలు కుక్కుల మొరగడంతో భయపడి కోర్టులోని పరుగెట్టారట.. ఎలాగా వచ్చాం కదా అని పత్రాలు చోరీ చేసి తీసుకెళ్లారట.. ఇదీ కథ..  ఇలాంటి కథలు  అధికారులు బోలెడు చెప్పారు. ఇక తాజాగా అధికారులు చెప్పిన ఉడుత కథ గతంలో చెప్పిన కహానీలన్నిటినీ మించిపోయిన సృజనాత్మకత, కాల్పనికతతో నిండిపోయింది. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లను ఉడుతలు కొరికేయడం వల్లనే అవి తెగి రోడ్డుపై ఆటోలో వెళుతున్న కూలీలపై పడ్డాయట. ఈ ఘటనలో ఆరుగురు మహిళా కూలీలు మరణించారు.

ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యమా అయ్యోరామా ఎంత మాత్రం లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అధికారుల ఉడుత కథ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. హైటెన్షన్ వైర్లు తెగిపడి ఆరుగురు మహిళా కూలీలు మరణించిన సంఘటనపై సర్వత్రా విద్యుత్ శాఖపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.  ఏపీ సర్కార్ విద్యుత్ సంస్థలకు నిర్వహణ ఖర్చులకూ నిధులు కేటాయించని కారణంగానే.. నిబంధనల ప్రకారం జరగాల్సిన తనిఖీలు నిలిచిపోయాయనీ, అందువల్లే సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపడేంతగా బలహీనపడినా ఎవరూ గుర్తించలేదని అంటున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ అధికారులు ఉడుత కథలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంటుండటంతో పారిస్‌లో ఉన్న జగన్ పేరుతో హడావుడిగా ఓ ప్రకటన  విడుదల చేసి మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల నష్టపరిహారం ప్రకటించేసి చేతులు దులిపేసుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నించిదే తప్ప,  విద్యుత్ అధికారుల   నిర్లక్ష్యం, నిర్లక్ష్యానికి బాధులపై చర్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

వాస్తవానికి ఈ సంఘటన జరగడానికి పూర్తి కారణం ప్రభుత్వమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కనీస అవసరాలకు కూడా నిధులు కేటాయించకుండా విద్యుత్ శాఖ పని తీరును పూర్తిగా నిర్వీర్యం చేశారనీ, ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని విపక్షాలు అంటున్నాయి. అధికారుల చేత ఉడుత కథలు చెప్పించి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా జగన్ హయాంలో అధికారులు కథలు చెప్పడంలో ఆరితేరిపోయారనడానికి ఇప్పుడు ఉడుత కథ.. అంతకు ముందు కాకాణి ఫైల్స్ సంఘటనలో చోరీ కథ ఇందుకు నిదర్శనాలని అంటున్నారు.