అస్తమించని సూర్యుడు.. సీమసింహం.. పరిటాల రవీంద్ర‌ చ‌రిత్ర ఇదే..

పరిటాల రవి.. దివంగత టీడీపీ నేత. 2005 జనవరి 24న ప్రత్యర్థుల చేతిలో పట్టపగలే హత్యకు గురైన ప్రజల మనిషి. చివరి శ్వాస వరకూ ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు. అరాచక శక్తులకు సింహస్వప్నంలా తిరుగాడిన నేత. అయితేనేం.. శత్రువులు పకడ్బందీగా పన్నిన పద్యవ్యూహంలో క్షణం పాటు పొరపాటుతో వేసిన ఆయన అడుగే నెత్తుటి మడుగులో ముంచింది. పరిటాల రవి మీద ప్రత్యర్తులు బుల్లెట్ల వర్షం కురిపించి, అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఆవరణలోనే ఆయన ఆఖరి శ్వాసను తీసేశారు దుర్మార్గులు.

తండ్రి శ్రీరాములు, సోదరుడు హరిబాబు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రజా నాయకుడు పరిటాల రవి. అనంతపురం జిల్లాలోని ముఠా కక్షల నిర్మూలనే జీవిత ధ్యేయంగా ప్రతి క్షణమూ తపించారు పరిటాల రవి. ఏపీలో తొలి మండల వ్యవస్థకు జరిగిన ఎన్నికల్లో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్ష పదవికి రంగంలో దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో రవి రాజకీయ రంగంలో తొలిసారిగా తన ఉనికికి చాటుకున్నారు పరిటాల రవి. భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చెన్నారెడ్డిని రామగిరి మండలంలో  కాలిడనివ్వకుండా పరిటాల రవి ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నారు. రవి చేసిన ఈ చర్యతో బడుగు బలహీన వర్గాలకు కొండంత బలాన్నిచ్చింది.

1991 నుంచి ప్రత్యర్థులు పెనుగొండ, ధర్మవరం ప్రాంతాలపై విశృంఖల స్వైర విహారంతో విరుచుకుపడ్డారు. హత్యలు, అపహరణలు, మానభంగాలు నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి అరాచక శక్తులతో ఎదురొడ్డి పోరాడిన పరిటాల రవి స్థానికుల్లో హీరో అయ్యారు. తనపై, తన అనుచరులపై నక్సలైట్ల ముద్ర వేసి హతమార్చాలనే ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్న రవి 1992లో జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.

1993 జూన్ 7న పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన రవికి అనంతపురం జిల్లాతో పాటు మొత్తం రాయలసీమ టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవికి బ్రహ్మరథం పట్టారు. మద్దెలచెరువు టీవీ బాంబు కేసులో జైలులో ఉన్న రవి జైలు నుంచే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి, అన్ని అవాంతరాలు అధిగమించి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. పరిటాల రవి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనా.. అప్పటి సీఎం ఎన్టీ రామారావు కేబినెట్ లో కార్మికశాఖ మంత్రి పదవి వరించింది. ఇక ఆ తర్వాత అనంపురం జిల్లా చరిత్రే పరిటాల రవి అడుగుజాడల్లో నడిచిందంటే అతిశయోక్తి కాదు.

పరిటాల రవి తన బలంతో శత్రు సంహారం చేస్తాడని ప్రత్యర్థులు భయపడ్డారు. వారి భయాలు, అంచనాలను చిత్తు చేశారు పరిటాల రవి. అనేక గ్రామాల్లోని వివిధ ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసమూ కల్పించారు. జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఆ తర్వాత టీడీపీ పగ్గాలను, సీఎం పదవిని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు చేపట్టారు. ఎనిమిదేళ్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటార రవి ఎన్టీఆర్ మరణానంతరం శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరారు. 

1997లొ తన తండ్రి జీవిత కథ ఆధారంగా తాను నిర్మిస్తున్న ‘శ్రీరాములయ్య’ సినిమా ముహూర్తం నవంబర్ 19న కారుబాంబు పేలుడులో తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడ్డారు. నసనకోట వద్ద శిథిలావస్థలో ఉన్న రాయల కాలంనాటి దేవాలయాన్ని 2003లో ఎంతో శ్రమతో పునరుద్ధరించారు. అదే ఆలయం ప్రాంగణంలో రెండున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో పరిటాల రవి 550 జంటలకు సామూహిక వివాహాలు చేయించారు. 2004 ఫిబ్రవరిలో మరో 1,116 జంటలకు పెళ్లిళ్లు జరిపించారు.

2004లో టీడీపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరుల ఏరివేత ప్రారంభించింది. రవిపై ఉన్న పాత కేసులు తిరగదోడింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, సరైన రక్షణ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు పరిటాల రవి. దీంతో రవికి అప్పటి వరకు రక్షణగా ఉండే గన్ మెన్ సంఖ్యను రెండుకు తగ్గించింది కాంగ్రెస్ సర్కార్. రవి ఇళ్లలో సోదాలు జరిగాయి. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారుల మీద దాడులు, హత్యల పరంపర కొనసాగింది.

ఇక తన ప్రాణాలకు వాటిల్లే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రవి మానసికంగా అన్నింటికీ సిద్ధం అయ్యారు. తన ఒక్కడి ప్రాణాలను రక్షించుకోవడం కోసం తనను నమ్ముకున్న ప్రజలను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నారు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ ఆఫీసులో అనేక మంది అతిరథ మహారథులు, పార్టీ శ్రేణులు, నాయకులు, సాయుధులైన అంగరక్షకులు ఉండగానే పరిటాల రవిపై ప్రత్యర్థులు గుళ్ల వర్షం కురిపించారు. ప్రజల నాయకుడిని నెత్తుటి మడుగులో నింపేశారు.

దివంగత జననేత పరిటాల రవికి స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణం ఇచ్చే అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకుని ‘అస్తమించని సూర్యుడు రవి’ అని ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.