సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో సోనియా గాంధీ చికిత్స తీసుకున్న సంగతి విదితమే.  కాగా సోనియాగాంధీ కరోనా బారిన పడిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.  అంతకుముందు జూన్ మొదటివారంలో సోనియా గాంధీకి కరోనా సోకిన సంగతి విదితమే.

 ఆ సమయంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. కోవిడ్ కారణంగా ఆ సమయంలో ఈడీ విచారణకు హజరు కాలేదు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ జూన్ నెలలో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమయంలో సోనియా కరోనా బారినపడటంతో విచారణ వాయిదా పడింది. సోనియా గాంధీ పూర్తిగా కోలుకున్న తరువాత జూలైలో ఈడీ విచారించింది.

అయితే నెల రోజులు గడవక ముందే సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడటం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా నెల రోజుల వ్యవధిలో రెండో సారి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రియాంకా గాంధీ కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల సోనియా గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలోని ఆందోళనల్లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.

ఈ ఆందోళనల తరువాత నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. సోనియా, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కూడా కోవిడ్ బారిన పడ్దారు. ఈ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్ సోకినట్లు.. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.