సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి ఆత్మహత్య కేసు.. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన అత్తమామలు

posted on: Jun 9, 2026 5:35PM

చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే మార్గంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా విజయలక్ష్మి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 

మృతురాలి అత్తమామలు భగవంత్ రెడ్డి, సులోచన దంపతులు కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ తమకు, తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తమ కుమారుడు కష్టపడి సంపాదించిన ఆస్తులపై కోడలు తరఫు బంధువుల కన్నుపడిందని ఆరోపించారు.

తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, డీసీపీని కలిసి వినతి పత్రం అందజేసినా పరిస్థితిలో మార్పు లేదని వృద్ధ దంపతులు తెలిపారు. దీంతో చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, తమకు తక్షణ రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వారి ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించినట్లు సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...