ఈడీ కార్యాలయానికి దిల్ రాజు తరలింపు.. సోషల్ మీడియాలో వదంతుల హల్ చల్
posted on Jan 24, 2025 1:56PM

గత నాలుగు రోజులుగా టాలీవుడ్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసంలో జరుగుతున్న ఐటీ సోదాలపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో వాస్తవాలను ఖరారు చేసుకోకుండా నెటిజనులు తమ ఇష్టారీతిగా పెడుతున్న పోస్టులతో టాలీవుడ్ పరిశ్రమ భయంభయంగా గడుపుతోంది. ఏది వాస్తవం, ఏది అబద్ధం తేల్చుకోలేక సతమతమౌతోంది.
తాజాగా దిల్ రాజును ఐటీ అధికారులు తమ వాహనంలో ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఐటీ సోదాలో జీఎస్టీలో అవకతవకలు జరిగినట్లు తేలిందనీ, ఆ కారణంగానే ఐటీ అధికారులు ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారంటూ కథనాలు వెల్లువెత్తాయి. వాస్తవం ఏమిటంటే దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై గత నాలుగు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఐటీ నంుచి ఈ సోదాలకు సంబంధించి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.
ఈ నేపథ్యంలోనే దిల్ రాజును ఈడీ కార్యాలయానికి తరలించారన్న వార్త ఒక్కసారిగా సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అయితే వాస్తవంగా ఐటీ అధికారలు దిల్ రాజును ఈడీ కార్యాలయానికి తరలించలేదు. చేయలేదు. గత నాలుగు రోజులుగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు, నాలుగో రోజైన శుక్రవారం (జనవరి 24) ఆయనను తమ వాహనంలో ఆయన ప్రొడక్షన్ కంపెనీ అయిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్ వీసీ) కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐటీ అధికారుల నుంచి ఈ సోదాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకూ సోషల్ మీడియాలో వదంతుల ప్రచారానికి విరామమనేదే ఉండదని పలువురు అంటున్నారు.