Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నియంతృత్వాన్ని ధిక్కరించిన అగ్నిశిఖ స్నేహలతారెడ్డి
posted on: May 13, 2026 3:22PM

భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 1975 జూన్ 25వ తేదీ ఒక మాయని మచ్చగా చరిత్రలో మిగిలిపోతుంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశాన్ని అంధకారంలోకి నెట్టివేసింది. పౌర హక్కుల హరణం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, రాజకీయ ప్రత్యర్థుల అక్రమ అరెస్టులతో దేశం అతలాకుతలమైన ఆ కాలంలో.. తన గళాన్ని వినిపించి ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీరవనిత స్నేహలతా రెడ్డి. కళాకారిణిగా, సామాజిక కార్యకర్తగా ఆమె చూపిన ధైర్యం నేటికీ అజేయమైనదిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన స్నేహలతా రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, నాటకకర్తగా, రచయిత్రిగా తెలుగు, కన్నడ రంగస్థలాలపై చెరగని ముద్ర వేశారు. ప్రముఖ కవి, దర్శకుడు పుట్టపర్తి పుట్టభిరామ రెడ్డిని వివాహం చేసుకున్న ఆమె.. సామాజిక న్యాయం పట్ల అమితమైన నిబద్ధత కలిగి ఉండేవారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా భావజాలంతో ప్రభావితులైన ఈ దంపతులు, సమాజంలోని అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం గళమెత్తేవారు. కళను కేవలం వినోద సాధనంగా కాకుండా, సామాజిక మార్పునకు ఒక ఆయుధంగా మలుచుకున్న ధీరవనిత స్నేహలతా రెడ్డి.
ఎమర్జెన్సీ ప్రకటించిన తక్షణమే దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. బెంగళూరు వేదికగా స్నేహలతా రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ నాయకుల నిర్బంధం, మీడియాపై సెన్సార్‌షిప్ వంటి అంశాలపై ఆమె బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వానికి ఆమె ఒక ప్రమాదకరమైన విమర్శకురాలిగా కనిపించారు.
ఈ క్రమంలోనే 1976 మే 2వ తేదీన ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కఠినమైన 'మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్' (మీసాచట్టం) కింద ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఎటువంటి విచారణ లేకుండానే వ్యక్తులను సుదీర్ఘకాలం నిర్బంధించే ఈ మీసా చట్టం ద్వారా అప్పట్లో వేలాది మందిని జైళ్లలో ఉంచారు. బెంగళూరు సెంట్రల్ జైలులో స్నేహలతా రెడ్డికి ఎదురైన అనుభవాలు అత్యంత అమానవీయం. జైలు అధికారులు ఆమెను ఏకాంత నిర్బంధంలో ఉంచి, ఇతర రాజకీయ ఖైదీలతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశారు. పుస్తకాలు, పత్రికలు చదువుకునే కనీస హక్కును కూడా నిరాకరించారు. అయితే.. వీటన్నింటికంటే దారుణమైన విషయం ఆమె ఆరోగ్య పరిస్థితి. ఆమె చిన్నప్పటి నుండి తీవ్రమైన ఆస్తమా వ్యాధితో బాధపడేవారు. జైలులోని అనారోగ్యకరమైన వాతావరణం ఆమె ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం.. మందుల విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది. తన జైలు డైరీలో ఆమె రాసుకున్న భావాలు అప్పటి హింసకు అద్దం పట్టాయి. నిర్బంధం అనేది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా గాయపరుస్తుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమించి, జైలులోనే మరణించే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం.. చివరి నిమిషంలో 1977 జనవరి 15న ఆమెను పరోల్‌పై విడుదల చేసింది.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జైలు నుండి బయటకు వచ్చిన ఐదు రోజులకే, అంటే 1977 జనవరి 20న స్నేహలతా రెడ్డి కన్నుమూశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో ఆమె తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకున్నారు. స్నేహలతా రెడ్డి కథను కేవలం ఒక రాజకీయ బాధితురాలి కథగా మాత్రమే చూడలేము. అది ఒక పౌరురాలికి తన దేశం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. మీసా వంటి కఠిన చట్టాలను పాలకులు తమ స్వార్థం కోసం ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్పడానికి ఆమె జీవితం ఒక చారిత్రక పాఠం. కళాకారులు, మేధావుల స్వేచ్ఛను హరించడం అంటే సమాజం మొత్తాన్ని మూగబోయేలా చేయడమేనని ఆమె నిరూపించారు.
నేటి తరం యువతకు స్నేహలతా రెడ్డి జీవితం ఒక గొప్ప పాఠం. ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడూ లభించే వరం కాదు, ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే అది సురక్షితంగా ఉంటుందని ఆమె జీవితం మనకు గుర్తు చేస్తుంది. విమర్శించడం అనేది దేశద్రోహం కాదనీ.. అది ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ఆక్సిజన్ వంటిదని ఆమె నమ్మారు. జైలు డైరీలో ఆమె రాసినట్లుగా.. ప్రతి మనిషి పుట్టిన ప్రయోజనం మానవజాతిని మెరుగైన స్థితికి తీసుకెళ్లడమే. ఆ ఆశయ సాధనలో ఆమె ప్రాణాలను అర్పించి స్వేచ్ఛా భారతావని కోసం అమరురాలయ్యారు. ఎ స్నేహలతా రెడ్డి అనే ధీరవనిత పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






