వీడు మామూలోడు కాదు.. 300మంది యువ‌తుల‌ను మోసం..

వీడు మామూలోడు కాదు. చుట్టానికి అందంగానే ఉంటాడు. అదే వాడి ఆయుధం. ఆ అంద‌మైన ఆయుధానికి మ‌రింత ప‌దును పెట్టాడు. సోష‌ల్ మీడియాలో యువ‌తుల‌కు చాటింగ్‌తో వ‌ల విసిరాడు. యువ‌తులతో పాటు పెళ్లైన మ‌హిళ‌ల‌నూ ట్రాప్ చేశాడు. న‌మ్మించాక‌.. ఎదుటివారు న‌మ్మార‌ని గ్ర‌హించాక‌.. ఇక ముగ్గులోకి లాగుతాడు. ముద్దు మాట‌లు చెప్పి.. ఆ టైప్ ఫోటోలు, వీడియాలో సంపాదిస్తాడు. ఇక అంతే. ఆ అందం ముసుగులో ఉన్న శాడిజం బ‌య‌ట‌కొస్తుంది. ప్రేమ మాట‌ల వెనుకున్న అస‌లు నేరం బ‌య‌ట‌ప‌డుతుంది. వాడు వాళ్ల అందాన్నేమీ దోచుకోడు. వాళ్ల సొమ్మునే దోచుకుంటాడు. అడిగినంతా ఇస్తారా? లేదంటే, ఆ ప‌ర్స‌న‌ల్ ఫోటోలు, వీడియోలు నెట్‌లో పెట్ట‌మంటారా? ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. డ‌బ్బు లేక‌పోతే గోల్డ్‌తోనైనా అడ్జ‌స్ట్ అవుతానంటాడు. ఇలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 200 మంది యువ‌తులు, 100 మంది మ‌హిళ‌లు వాడి అంద‌మైన నేరానికి బాధితులుగా మారారు. ఇంత‌టి ఖ‌త‌ర్నాక్ క్రైమ్ క‌థా చిత్ర‌మ్‌లో హీరో క‌మ్ విల‌న్‌.. క‌డప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీ.

ఎన్నిపేర్లు మారుస్తాడో.. అన్ని కుట్ర‌ల‌కూ తెగ‌బ‌డ‌తాడు. బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లోనే చదువుకు డంకీ కొట్టేశాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలకు తెగ‌బ‌డ్డాడు. జైలుకు కూడ వెళ్లాడు. బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక‌రిని మోసం కూడా చేశాడు. ఇటీవ‌ల ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేసి విచారించగా.. పోలీసుల‌కే దిమ్మ‌తిరిగే అస‌లు విష‌యాలు తెలిశాయి. చోరీ కేసు కాస్తా.. వ‌ల‌పు కేసుగా ట‌ర్న్ తీసుకుంది.  

కడప, విజయవాడ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో అత‌డి బాధితులు ఉన్నారు. ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులు, వివాహితుల‌తో పరిచయం పెంచుకునేవాడు. మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించేవాడు. వారితో చాటింగ్‌ చేస్తూ వారి అస‌భ్య చిత్రాలు, వీడియోలు సంపాదించి.. ఆ త‌ర్వాత‌ బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు పంపాలని డిమాండ్‌ చేసేవాడు. లేదంటే ఆ కంటెంట్‌ను సోష‌ల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు ఇలా సుమారు 200మంది యువతులు, వందమంది మహిళలను మోసం చేశాడు. అతని ఫోన్ స్వాధీనం చేసుకొని ప‌రిశీలించిన పోలీసుల‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఫోన్లో అన్నీ మహిళలు, అమ్మాయిల చిత్రాలే ఉన్నాయి. అతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయని గుర్తించారు. ప్ర‌స‌న్న‌కుమార్ నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా పోలీసులు. ఇలాంటి మోస‌గాళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. అందం చూసి, మాట‌లు చూసి.. టెంప్ట్ కావొద్ద‌ని సూచిస్తున్నారు. ఎలాంటి ప‌ర్స‌న‌ల్ కంటెంట్ ఎవ‌రితోనూ షేర్ చేసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.