కాలుష్య వ్యతిరేక ర్యాలీలో హిడ్మా అనుకూల పోస్టర్లు, నినాదాలు
posted on Nov 24, 2025 9:50AM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో ఇటీవల ఏపీలో ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆదివారం (నవంబర్ 24) సాయంత్రం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా హిడ్మాకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా అనుమతి లేకుండా ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొందరు నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రై ప్రయోగించారు. దీంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా పోలీసులపై నిరసనకారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించడం చాలా అసాధారణమైన ఘటనగా ఢిల్లీ డీసీపీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 15 మంది నిరసనకారులను అదుపులోనికి తీసుకున్నారు. కాలుష్య వ్యతిరేక నిరసనలలో హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లపై కూడా విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.