రేవంత్ కు సిట్ నోటీసులు.. భయపడేది లేదన్న టీపీసీసీ చీఫ్

దేశ రాజధానిలో మహిళలపై దాడులు పెచ్చరిల్లాయి అన్నందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కీలక నేత రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆధారాలు చూపమని, అలాగే తెలంగాణలో టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజిపై అధికార పార్టీ అగ్రనేతలపై ఆరోపణలు చేసిన రేవంత్ కు నోటీసులు ఇచ్చారు పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు. హస్తినలో మహిళల భద్రత ప్రమాదంలో ఉందన్న మాట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్తగా చెప్పలేదు.

అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిపై ఆరోపణలు చేసినది రేవంత్ ఒక్కరే కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇవే ఆరోపణలు చేశారు. అయినా ఆరోపణలపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాల్సిన పోలీసులు ఆరోపణలు చేసిన వారికే నోటీసులు ఇచ్చి ఆధారాలు ఇవ్వాలనడం, తాము చేయాల్సిన పనిని వదిలేయడం గానే భావించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమపై ఆరోపణల విషయంలో స్పందించిన తీరు ఒకలాగే ఉండటం ఎంతమాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే   సిట్ నోటీసులకు భయపడేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలన్న తన డిమాండ్ ను పునరుద్ఘాటించారు.

సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదన్న ఆయన తన వద్ద ఉన్న ఆధారాలను సీట్ కు ఇచ్చే ప్రశక్తే లేదన్నారు. స్వయంగా కేసీఆర్ కేంద్రం వద్ద సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలుంటే తమకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలున్నాయని ప్రకటించారనీ, అటువంటి సిట్ ను నమ్మి ఆధారాలెలా ఇస్తామని రేవంత్ అన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తే అప్పుడు తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని స్పష్టం చేశారు.