సిట్ పీఛే ముఢ్?

కేంద్రానికే కాదు.. రాష్ట్రాలకూ దర్యాప్తు సంస్థలున్నాయంటూ గర్జించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చెల్లదంటూ కోర్టు విస్పష్టంగా తేల్చేసింది.

మీకు  దర్యాప్తు  సంస్థలు ఉంటే మాకు లేవా అంటూ కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయ యుద్ధాన్ని దర్యాప్తు సంస్థల వరకూ తీసుకు వచ్చిన కేసీఆర్..ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పుతో కంగు తిన్నారు. ఎమ్మెల్యేల కోనుగోలు బేరసారాల కేసులో సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం దాటి వెళ్లి మరీ దర్యాప్తులో దూకుడు ప్రదర్శించి సంచలనాలు సృష్టిస్తుందని ఆశించిన కేసీఆర్ ఇప్పుడు సిట్ ఉనికే లేకుండా పోయే పరిస్థితి ఎదురు కావడంతో ఏం చేయాలన్న మీమాంసలో పడ్డారు.

తెలంగాణలో అదుపులోనికి తీసుకున్న ముగ్గురు వినా తెలంగాణ బయటి వ్యక్తులకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం తప్ప మరేం చేయలేకపోయిన సిట్.. ఇప్పుడు కోర్టు తీర్పుతో అసలీ కేసులో దర్యాప్తు చేయడానికే అర్హత లేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది. దీంతో సిట్ ను ఆయుధంగా భావించి కేసీఆర్ కేంద్రంపై మొదలెట్టిన యుద్ధం ఆరంభంలోనే పరాజయం ఎదురైన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏసీబీ కిందకు వస్తాయి. ఆ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను దర్యాప్తు చేయాల్సింది ఏసీబీయే తప్ప సిట్ కాదని కోర్టు స్పష్టం చేసింది.  

దీంతో సిట్ ఉనికే ప్రశ్నార్థకం అయింది.  గతంలో రేవంత్ రెడ్డిపై ఇలాంటి కేసే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఓటుకు నోటు కేసు కాబట్టి ఈసీ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని రేవంత్ సుప్రీం కోర్టులో   పోరాడుతున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డిని ఎలా అయితే స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారో..ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో కూడా కేసులోనూ నిందితులపై ఏసీబీ కేసు పెట్టారు. అయితే అప్పటిలా కాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ సర్కార్   సిట్ ఏర్పాటు చేసింది.  ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయడం చెల్లదని ఏసీబీ కోర్టు చెప్పింది.     ఇప్పుడిక కేసీఆర్ ఏం చేస్తారన్నది చూడాలి.