TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..!

Published on: Fri Aug 7, 2026 12:54PM

సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..!

అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..

సిబ్లింగ్ థెరపీ అంటే..

సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు.

ప్రయోజనం...

సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది.

ఎమోషనల్ సపోర్ట్..

సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.

                             *రూపశ్రీ.