బిజెపిలో చేరితే ఓకే.. షిండే.. బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధమా?.. రౌత్‌

మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం చిత్రంగా మారింది. మాడు మీద కొట్టి ఆన‌క బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసి న‌ట్టుగా మారింది. ముఖ్య‌మంత్రి  ఉద్ధ‌వ్ థాక్రేను గ‌ద్దె దించేందుకు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవ‌నెత్తి 41 మంది ఎమ్మెల్యేల‌తో రెబెల్ శిబిరంతో థాక్రేను బెద‌ర‌గొట్టాడు. ఇప్పుడు త‌న రూటు మార్చి థాక్రే  అంటే కోపం లేదు గాని పార్టీని బిజెపీతో క‌లిపితే  ఆయ‌న‌కు మ‌ద్ద‌తునిస్తాన‌ని కొత్త నిబంధ‌న పెట్టి మొత్తం వ్య‌వ‌హారంలో కొత్త మెలిక‌పెట్టారు.  

ఉద్ధవ్ థాక్రే  సీఎం గద్దె దిగిపోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో జట్టు కడితే చాలని ప్రకటించారు. ఈ మేరకు రెబల్ శిబిరంలో ఉన్న శివసేన ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే రాజీనామాను తాము కోరుకోవడం లేదు.  ప్రభుత్వ కూటమిలోని ఇతరులపై మాకు ఆగ్రహం ఉందని బీజేపీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నా మని దీపక్ కేస్కర్ పేర్కొన్నారు. వాస్త‌వానికి  కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులన్ని కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్దనే వుండ‌డం తోనే  స‌మ‌స్య‌లు వ‌చ్చాయి.  శివసేన వద్ద కేవలం పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు మాత్రమే ఉన్నా యని అసంతృప్తి త‌లెత్తింది. కాగా ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ గురువారం ఉదయమే గువహటిలో రెబల్ ఎమ్మె ల్యేల శిబిరంలో చేరారు.

గత రెండు రోజులుగా ఉద్ధవ్ థాక్రే  పక్కనే కనిపించిన ఆయన  గురువారం ఉదయం అసోం వెళ్లారు. తనతో పాటు ఇద్దరు సేన ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే గువహటి వచ్చా రని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో జట్టు కట్టాలని ఇక్కడున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నా రని దీపక్ కేస్కర్ చెప్పారు.  ఉద్ధవ్ స‌మావేశానికి  12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని స‌మాచారం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భావోగ్వే దంతో ఎమ్మెల్యేలకు చేసిన విజ్ఞప్తి విఫలమైంది.  

ఉద్ధవ్‌తో కలిసి ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేలు అజయ్ చౌదరీ, రవీంద్ర వైకర్, రాజన్ సాల్వీ, వైభవ్ నాయక్, నితిన్ దేశ్‌ముఖ్, ఉదయ్ సామంత్, సునీల్ రౌత్, సునీల్ ప్రభు, దిలీప్ పాటిల్, రమేష్ కొర్గాన్ కర్, ప్రకాశ్ ఫతర్పెకర్ మీటింగ్‌కు హాజరయిన వారిలో ఉన్నారు. ఇదిలా వుండ‌గా ఇర‌వై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నార‌ని, శివ‌సేన ఇంకా బ‌లంగానే వుంద‌ని శివ‌సేన అగ్ర‌నేత సంజ‌య్ రౌత్  అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో చాలామంది ఒత్తిడికి గుర‌య్యార‌న్న‌ది అర్ధ‌మ‌వుతోంద‌న్నారు.

 రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకి నిజమైన భక్తులు కాదని మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని  బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి శివసేన ఎమ్మె ల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిందని రౌత్ ఆరోపించారు. ఈడీకి భయపడి పారిపోయిన ఎమ్మెల్యేలు నిజమైన బాల్‌థాక్రే అనుచరులు కాదన్నారు. మిగిలినవారమే నిజమైన భక్తులమన్నారు. తమకు కూడా ఈడీ ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా శివసేనను వీడబోమని చెప్పారు. స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష‌ ఏర్పాటు చేస్తే ఎవరికి  సాను కూలత, ఎవరికి ప్రతికూల అనే విషయాలు తెలుస్తాయని సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.