అప్పుడు అన్న కోసం.. ఇప్పుడు త‌న కోసం.. ష‌ర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర..

జ‌గ‌న‌న్న క‌న్నా జ‌గ‌మొండి. అన్న హ్యాండ్ ఇస్తేనేం.. త‌న‌కు స‌త్తా లేదా అంటూ పుట్టింటి నుంచి పెట్టాబేడా స‌ర్దుకొని మెట్టింటికి వ‌చ్చేసింది. జ‌గ‌న్‌కు ధీటుగా రాజ‌కీయం చేస్తానంటోంది. అయితే, ఆమె ఎంచుకున్న లొకేష‌నే ఆమె ఎవ‌రి బాణ‌మ‌నే డౌట్‌కు కార‌ణం అవుతోంది. జ‌గ‌న్‌పై కోపంతో రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. వైఎస్సార్‌సీపీకి పోటీగా ఏపీలోనే వైఎస్సార్‌టీపీ స్థాపించి పోటీ చేయాల్సింది. కానీ, ఆమె వెరైటీగా తెలంగాణ‌ను త‌న రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంగా ఎంచుకున్నారు. దొర‌ల పాల‌న‌ను గ‌ద్దె దించ‌డానికంటూ.. రాజ‌న్న రాజ్యం స్థాప‌న కోస‌మంటూ.. కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ క‌వ‌రేజ్‌తో పొలిటిక‌ల్‌గా లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నిరుద్యోగ దీక్ష‌ల‌తో ఉనికి చాటుకోగా.. ఇప్పుడిక పీకే డైరెక్ష‌న్‌లో సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుడుతున్నారు. బుధ‌వారం నుంచి ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర మొద‌లుపెడుతున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌.

త‌న తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డిచేలా.. చేవెళ్ల మండలం శంకరపల్లి క్రాస్‌ నుంచి పాద‌యాత్ర‌ ప్రారంభించ‌నున్నారు. 400 రోజులు.. 4వేల కిలోమీట‌ర్ల దూరం పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర ప్ర‌జాప్ర‌స్థానం సాగనుంది. 

ప్ర‌తీరోజూ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ష‌ర్మిల‌ పాదయాత్ర చేస్తారు. రోజుకు సుమారు 12 కిలోమీట‌ర్లు న‌డిచేలా షెడ్యూల్ చేశారు. ప్రతీరోజూ ర‌చ్చ‌బండ మాదిరిగా మాట‌-ముచ్చ‌ట కార్య‌క్ర‌మం ఉంటుంది. ఇక‌, ప్రతి మంగళవారం ఎక్కడ ఉంటే అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేప‌డ‌తారు. పాద‌యాత్ర‌లో భాగంగా మొత్తం 9 భారీ బ‌హిరంగం స‌భ‌లు నిర్వ‌హిస్తారు. 

బుధ‌వారం ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభించ‌నున్నారు. ఈ త‌రం యువ‌త‌కు.. న‌వ‌త‌రం నాయ‌క‌త్వం.. అనేది ష‌ర్మిల పాద‌యాత్ర ట్యాగ్‌లైన్‌.