కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి షర్మిల ఫిర్యాదు

తెలంగాణలో రాజకీయ సందడి జోరందుకుంది. ఇప్పటి వరకూ కేవలం విమర్శలకే పరిమితమైన పాదయాత్రల బాటసారి షర్మిల ఇప్పుడు యాక్షన్ లోకి దిగారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రంలో నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న షర్మిల పాదయాత్రకు ఒకింత విరామమిచ్చి హస్తిన వెళ్లారు. ఇంత కాలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం, తెరాస ప్రభుత్వం, నాయకులపై చేసిన విమర్శలకు కొనసాగింపుగా ఆమె హస్తినలో నేరుగా సీబీఐ డెరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసి, తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. 

తెరాస ను భారాస( భారతీయ రాష్ట్ర సమితి)గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తరువాత రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వేదికగానూ తెలంగాణ రాజకీయాలు వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. తెరాస బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం వెలువడిన తరువాత షర్మిల హస్తిన బాట పట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ హస్తిన ముఖం చూడని షర్మిల ఇప్పుడు తొలిసారిగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంతో.. ఆమె ఢిల్లీలో  ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు జరుపుతారన్న ఊహాగానాలను పూర్వపక్షం చేస్తూ నేరుగా సీబీఐ మెట్లెక్కారు. తెలంగాణ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ ఆమె ఇంత కాలం ఆరోపణలు చేశారు.

ఇప్పుడు ఇదే అవినీతిపై ఆమె సీబీఐ డైరెక్టర్ ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమె తన ఫిర్యాదులే పేర్కొన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మేఘా కంపెనీతో కలిసి కేసీఆర్ సర్కార్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా  దాదాపు ఇరే ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అవే ఆరోపణలతో షర్మిల ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత కాలం కేవలం ఆరోపణలే, కానీ ఇప్పుడు నేరుగా ఫిర్యాదు అందడంతో సీబీఐ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఎక్కువ అవుతోంది.  

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ,ఈడీ, ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరాస అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత, సమీప బంధువు, ఎమ్మెల్సీ సంతోష్ రెడ్డి పేర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల  కాళేశ్వరం అవినీతిపై  ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించడం, ఆ పార్టీ తరఫున దేశ వ్యాప్త పర్యటనకు ఉపక్రమించనున్న తరుణంలో  షర్మిల తెరాస అవినీతిపై సీబీఐకు చేసిన ఫిర్యాదు రాజకీయంగానూ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.