వైఎస్ వారసత్వ పోటీలో వెనుకబడ్డ జగన్!?
posted on Jan 11, 2025 1:19PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తమ తండ్రి వైఎస్ రాజకీయవారసత్వం కోసం తీవ్రమైన పోటీ జరుగుతోంది. అయితే ఈ పోటీలో షర్మిలే ఒకింత ముందున్నారన్న అభిప్రాయం కూడా ప్రజలలో వ్యక్తం అవుతున్నది. నిర్భయంగా, నిస్సంకోచంగా షర్మిల తన అన్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను ఎండగట్టడమే కాకుండా, వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచారంటూ పలు ఉదంతాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది లేదు. పైగా నిఖార్సైన కాంగ్రెస్ నేతగా ఆయన తన జీవితాంతం బీజేపీని వ్యతిరేకించారనీ, అందుకు భిన్నంగా తన అన్న, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారనీ విమర్శిస్తున్నారు.
వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పేర సొంత పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కుటుంబం ముక్తకంఠంతో జగన్ ను ప్రకటించింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంతే అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది.
ఆ మార్పు ఎలా ఎందుకు వచ్చిందంటే.. ఎదుగింటి సందింటి రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) కుటుంబం లో యుద్ధం మొదలయింది. ఆస్తుల తగాదా నుంచి అది వారసత్వ పోరు వరకూ వెళ్లింది. ఆస్తుల పోరు కాస్తా రాజకీయ వారసత్వ రణం వరకూ వెళ్లింది. ఈ యుద్ధంలో అన్న జగన్ ఒక వైపు.. చెల్లి వైఎస్ షర్మిల మరో వైపు మోహరించారు. అమ్మ కుమార్తె షర్మిల వైపే నిలిచారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుటుంబం మొత్తం ఒక్కటై నిలిచింది. కష్ట కాలంలో ఒకరినొకరు ఓదార్చుకోవడంలో కానీ, తండ్రి రాజకీయ అండ చేజారిపోకుండా చూసుకోవడంలో కానీ, రాజకీయంగా కుటుంబం పెత్తనం సడలిపోకుండా కాపాడుకోవడంలో కానీ తల్లి, కుమారుడు, కుమార్తె, వీళ్లే కాకుండా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబం ఇలా మొత్తం వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపై నిలిచింది.
జగన్ సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ అధినేతగా తన సొంత రాజకీయ ప్రయాణం ఆరంభించారు. 2014 ఎన్నికలలో విభజన ఎమోషన్స్ తో పాటు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ పై ఉన్న పలు కేసులు, ఆయన వ్యవహార శైలిపై ప్రజలలో ఉన్న సంశయాలు, అనుమానాల కారణంగా జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అయితే విపక్ష నేతగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటూ నిత్యం జనంలోనే గడిపారు. ఆయన ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో వచ్చిన సానుభూతి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జనంలో ఉన్న అభిమానానికి తోడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు జగన్ కు ప్లస్ అయ్యాయి. దాంతో ఆ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ విజయానికి పైన చెప్పిన అన్ని కారణాలతో పాటు వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు అండగా నిలబడటం కూడా ప్రధాన కారణంఅనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం, ప్రసంగాలు, జగన్ తల్లి విజయమ్మ కుమారుడి కోసం రోడ్డుపై బైఠాయించి మరీ తెలిపిన నిరసనలు, బాబాయ్ వైఎస్ వివేకా, ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెన్నంటి ఉండటం ఇలా ఇవన్నీ జగన్ కు కలిసి వచ్చాయి. ఇదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ కు కలిసి వచ్చిన అంశాలే ఆయనకు 2024 ఎన్నికలలో ప్రతికూలంగా మారాయి.
నాడు జగన్ వెనుక ఐక్యంగా నిలిచిన కుటుంబం అండ లేకుండా పోయింబది. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయన వైపే చూపించాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఆయనకు వ్యతిరేకంగా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల 2024 ఎన్నికలలో జగన్ కు గురిపెట్టిన బాణంగా మారి ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇవన్నీ కూడా జగన్ స్వయంకృతాపరాధాలే అని చెప్పక తప్పదు. తల్లి చెల్లి సహా వైఎస్ కు సన్నిహితులు అన్న వారందరినీ జగన్ వదిలించేసుకున్నారు.
సరే ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు మారలేదు. తనపై విమర్శలు గుప్పించిన చెల్లి షర్మిలపై తన సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయించారు. దీంతో ఆమె జగన్ పై మరింత తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఆమె మరోసారి వైఎస్ రాజకీయ వారసురాలిని తానే నని ప్రకటించుకున్నారు. ప్రధాని మోడీతో జగన్ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలోకి తొక్కి జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ బీజేపీతో అంటకాగుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడినని ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది తాను మాత్రమే అని చెప్పారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని షర్మిల స్పష్టం చేశారు. మొత్తంగా వైఎస్ వారసత్వ పోరులో జగన్ ను వెనక్కు నెట్టి షర్మిల ముందుకు వచ్చారని చెప్పకతప్పదు. అధికారంలో ఉండగా వైఎస్ బ్రాండ్ ను వదిలించుకుని సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన జగన్.. ఓటమి తరువాత మళ్లీ వైఎస్ పేరు జపిస్తుండటం సహజంగానే జనంలో ఆయనను చులకన చేసింది. దీంతో షర్మిల వైపునకే వైఎస్ అభిమానులు మొగ్గు చూపుతున్నారు.