బిజేపికి మరో బిగ్ షాక్.. వలస నేతలంతా జంపేనా? 

అధికారమే లక్ష్యంగా దూకుడుగా వెళుతున్న తెలంగాణ బీజేపీ బండికి రివర్స్ గేర్లు పెడుతున్నాయి. వివిధ పార్టీల నుంచి జోరుగా సాగిన వలసలతో ఊపు మీదు కనిపించిన తెలంగాణ బీజేపీ.. కమలం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి కటీఫ్ చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నేత హ్యాండిచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డికి బీజేపీకి రాజీనామా చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను పార్టీలో ఉండలేకపోతున్నానని ఆయన లేఖలో వెల్లడించారు. 

టీడీపీలో ఓ వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి గత లోక్ సభ ఎన్నికల సమయంలో ముందు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గానే ఉంటున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పెద్దిరెడ్డి కూడా గతంలో హుజురాబాద్ నుంచే పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన బీజేపీలో చేరారని చెబుతారు. అందుకే ఈటల చేరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈటల బీజేపీలోకి రావడానికి తాను వ్యతిరేకం కాదంటూనే.. తనతో సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. 

బీజేపీలో ఈటల చేరికను పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. పెద్దిరెడ్డితో బీజేపీ ముఖ్య నేతలు మాట్లాడారని, ఆయన కూల్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. బండి సంజయ్ తో జరిగిన చర్చలు ఫలించాయని, ఆయన బీజేపీలోనే కొనసాగుతారని బీజేపీ నేతలు చెప్పారు. కాని సడెన్ గా రాజీనామాతో ముందుకు వచ్చారు పెద్దిరెడ్డి. అయితే పెద్దిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియరాలేదు. ఆయన టిఆర్ఎస్ లో చేరతారా? కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.

కొన్ని రోజులుగా తెలంగాణలో బిజెపికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. టిపిసిసి చీఫ్ గా రేవంత రెడ్డి నియామకం జరిగిన తర్వాత పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.ఇటీవల ఆ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్ చేరుతానని తెలిపారు. ఇక దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. బీజేపీలో చేరుతారని భావించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం మనసు మార్చుకున్నారని, ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారని చెబుతున్నారు.

బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బోడ జనార్ధన్, చాడా సురేష్ రెడ్డి వంటి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి బీజేపీలో చేరిన నేతలు కూడా సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్ లోకి వచ్చారంటున్నారు.