మంజూ.. ఆత్మ‌విశ్వాసానికి మ‌రో పేరు!

చేతిలో విద్య అంటూ ఉండాలేగాని ఎక్క‌డ‌న్నా బ‌తికేయొచ్చు అనేది పాత‌కాలంవారి మాట‌. పాత ఎప్పు డూ బంగార‌మే. బంగారం ఎప్పుడూ బంగార‌మే. బ్రిట‌న్ బ్రైట‌న్ న‌గ‌రంలో 85 ఏళ్ల మంజులా ప‌టేల్ హోట‌ల్లో టిఫిన్ చేయ‌కుండా అక్క‌డి వారికి ఒక్క‌రోజూ స‌రిగా గ‌డ‌వ‌డంలేదంటారు. అదుగో అంత‌టి ఇష్టం ఆ టిఫిన్లు, ఆమె ఆతిథ్యం అంటే. అక్క‌డి సంప్ర‌దాయ ఆహార‌ప‌దార్ధాలేకాకుండా, భార‌త్ ఉత్త‌రాది వంట‌కాల‌తోనూ ఆమె అక్క‌డివారి మ‌న‌సు గెలిచింది. ఆమెకు అంద‌రి రుచుల‌కు త‌గ్గ‌ట్టు చేసిపెట్ట‌డంతో పాటు అంద‌ర్నీ త‌న పిల్లల్లానే చూస్తూ, ప‌ల‌క‌రించ‌డం మ‌హా స‌ర‌దా. ఆమె ఈ ఆతిథ్య‌పు ప్ర‌త్యేక‌తే ఇంగ్లీషు వారిని అమాంతం ఆక‌ట్టుకుంది. 

వాస్త‌వానికి ఆమె ఉగాండా కంపాలా న‌గ‌రం నుంచి బ్రైట‌న్‌కు వ‌చ్చిందేగాని మొద‌టి నుంచి ఇక్క‌డ స్థిర ప‌డిన భార‌తీయ సంత‌తికి చెందిన‌ది కాదు. ఆమెది కావ‌డానికి గుజ‌రాత్‌. కానీ బాల్యంలోనే  ఉగాండా వెళిపోయారు. ఆమె 13 ఏళ్ల వ‌య‌సులోనే తండ్రి చ‌నిపోవ‌డంతో ఇంటి బాధ్య‌త‌ను భ‌రించాల్సి వ‌చ్చిం ది. ఆ చిరుప్రాయంలో తానేమీ ఉద్యోగం చేయ‌లేక త‌న నాన‌మ్మ నుంచి అనేక ర‌కాల వంట‌కాల గురించి తెలుసుకుంది. వారు వంట చేస్తున్న‌పుడు ఎలా చేస్తారు, ఎన్ని ర‌కాలుగా వంట చేయ‌వ‌చ్చు అనేవి ఎంతో నేర్చుకుంది. అంతే తానూ అనేక ర‌కాల టిఫిన్స్ త‌యారు చేయ‌డంలో నిపుణురాల‌యి స్కూలు కు వెళ్లే పిల్ల‌ల‌కు బాక్స్‌లు స‌ర్ది పెట్టేది. అనేక కార్యాల‌యాల్లో ప‌నిచేవారికి త‌న చేతిరుచి చూపింది. 

ఆమె వంట‌కా ల‌కు అంతా ఫిదా అయ్యారు. క్ర‌మేపీ ఆమె ఉగాండాలో మంచి రెస్టారెంట్ ఆరంభించారు. కానీ అన్నీ ఎల్ల‌కాలం మ‌నం అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వు గ‌దా. ఉగాండాకి ఈదీ అమీన్ అనే రాక్ష‌సుడు పాల కుడు అయిన త‌ర్వాత అక్క‌డి ప‌రిస్థితులు మొత్తం దెబ్బ‌తిన్నాయి. దేశంలో ఆసియావాసులు ఆర్ధిక దోపి డీకి పాల్ప‌డు తున్నార‌ని అమీన్ ఆగ్ర‌హించాడు. త‌క్ష‌ణం దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశించాడ‌ట‌. అంతే మంజు లాంటి వారు అనేక‌మంది ఉగాండా విడిచిపెట్ట‌వ‌ల‌సి వ‌చ్చింది.

అలా మంజు 1972 లో బ్రిట‌న్ చేరుకుంది. రాగానే చిన్న ఉద్యోగం కోసం విశ్వ‌య‌త్నం చేసింది.  కానీ ఎక్క‌డా ఉద్యోగం రాలేదు. కానీ ఆమె నిరాశ‌ప‌డ‌లేదు. ఆమె త‌న‌కు తెలిసిన విద్య‌నే జీవ‌నోపాధి మార్గంగా చేసుకుంది. అక్క‌డ ప‌రిచ‌య‌స్తుల‌తో క‌లిసి రెస్టారెంట్ ఆరంభించింది. అది  దిన‌దిన‌ప్ర‌వ‌ర్ధ‌మాన‌మై యావ‌త్ బ్రైటెన్ ప్ర‌జ‌లు రెస్టారెంట్‌కి క్యూక‌ట్టేలా చేయ‌గ‌లిగింది. ఇపుడు ఆమె కుమారుడు జేమిన్‌ ప‌టేల్ చూస్తున్నాడు. ఇటీవ‌లే మంజు 80వ పుట్టిన‌రోజును రెస్టారెంట్‌లోనే వీరాభిమానుల మ‌ధ్య బ్ర‌హ్మాండంగా జరిపాడు ప‌టేల్‌.