నిండు గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన కసాయి మామ
posted on Oct 18, 2025 5:50PM
.webp)
కులవివక్ష మళ్లీ క్రూరరూపం దాల్చింది. ఓ గర్భిణీ ప్రాణాన్ని కూడా క్షమించని అమానుష ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కడుపులో ఎనిమిది నెలల బిడ్డ ఉన్న కోడలిని, కులం పేరుతో ఓ మామ గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు.
వివరాల్లోకి వెళితే దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ (బీసీ కులం) అదే గ్రామానికి చెందిన రాణి (ఎస్టీ కులం)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ కులాంతర వివాహం శేఖర్ తండ్రి సత్తయ్యకు అస్సలు నచ్చలేదు. కుమారుడు తన కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక, కోపం పీక్‌కి చేరింది.
ఇదిలా ఉండగా, రాణి ఎనిమిది నెలల గర్భిణీ అయ్యింది. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో శేఖర్-రాణి దంపతులు ఉన్నారు. అయితే ఈ సంతోషం సత్తయ్యకు నచ్చలేదు. క్రోధంతో రగిలిన అతడు, గర్భిణీ కోడలిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రాణి అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ఘటనతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.