హైకోర్టు లాయర్ నుంచి కేరళం సీఎంగా సతీశన్‌ ప్రస్థానం

posted on: May 14, 2026 6:06PM

కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దాంతో  గత పది రోజులుగా కేరళం ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది   కేరళం సీఎంగా సతీశన్ పేరును గురువారం (మే 14) ఏఐసీసీ ప్రకటించింది. సీఎం పదవి కోసం సతీషన్‌తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ , రమేష్ చెన్నితాల పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో  ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. అయితే విధేయత లెక్కలు, సీనియర్టీల కన్నా కేరళం క్యాడర్ అభిష్టానానికి తలొగ్గిన కాంగ్రెస్ హైకమాండ్ చివరకు  ప్రజా మద్దతున్న సతీషన్‌‌ వైపే  మొగ్గుచూపింది.   సతీషన్‌కు యూడీఎఫ్ భాగస్వామ్య పక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా గట్టి మద్దతు ఇచ్చింది. కేరళ ఎన్నికలలో  ఐయూఎంఎల్ 22 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యపక్షం ఒత్తిడి కూడా ఈ విషయంలో పనిచేసింది.

ఎల్‌డీఎఫ్   హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్  కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది. 
 
వి.డి. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964, మే 31న ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరు. ఈయన తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర మీనన్. భార్య లక్ష్మీప్రియ. సతీశన్ దంపతులకు కుమార్తె ఉన్నిమాయ ఏకైక సంతానం. నాయర్ల కుటుంబంలో పుట్టిపెరిగిన సతీశన్ ఉన్నత విద్యావంతుడు. సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ కేరళ హైకోర్టులో పదేళ్లపాటు లాయర్ గా   ప్రాక్టీస్ చేశారు. కమ్యునిస్టు కంచుకోటగా ఉన్న పరాపూర్ నుంచి వరుసగా ఆరు సార్లు..  ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు.  కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2001లో కేరళ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన సతీశన్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు .

google-ad-img
    Related Sigment News
    • Loading...