ఉన్న‌తాధికారిపై ఇసుక చల్లిన ఉద్యోగి.. దేవాదాయ‌శాఖ‌లో 'భూ'కంపం..

పై అధికారిపై కోపం వ‌స్తే ఏం చేస్తారు? తిడితే ప‌డ‌తారు.. లేదంటే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తారు.. అదీ కాదంటే తోటి ఉద్యోగులకో, ఇంట్లో వారికో చెప్పుకొని బాధ‌ప‌డతారు. బాస్ పీడ ఎప్పుడు విర‌గ‌డ‌వుతుందా.. ఎప్పుడు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ, ఆమె మాత్రం అలా కాదు. కోపం వ‌చ్చింది. ఆవేశంతో ర‌గిలిపోయింది. ఇక అంతే.. గుప్పెడు ఇసుక తీసుకొచ్చి ఆ అధికారి ముఖంపై కొట్టింది. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు అవ‌డంతో.. ఏపీ దేవాదాయ శాఖ‌లో ర‌చ్చ రంబోలా అవుతోంది. 

విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుక వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. 

పుష్పవర్ధన్‌ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బందిపై పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్ శాంతి ఉదాసీనతను పుష్పవర్ధన్‌ ప్రశ్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని అంటున్నారు. 

ఆమె అలా ముఖం మీద ఇసుక చ‌ల్లినా.. డిప్యూటీ క‌మిష‌న‌ర్ పుష్ప‌వ‌ర్థ‌న్ మాత్రం ఏమాత్రం కంట్రోల్ త‌ప్ప‌లేదు. కోపానికి రాలేదు. కుర్చీలో అంతే శాంతంగా కూర్చున్నారు. ఆమెను ప‌ల్లెత్తి మాట కూడా అన‌లేదు. అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పుష్ప‌వ‌ర్థ‌న్‌. విజిలెన్స్‌ సిబ్బంది కార్యాలయానికి చేరుకుని మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు. డీసీ పుష్ప‌వ‌ర్థ‌న్‌పై ఏసీ శాంతి ఇసుక చల్లిన సీసీకెమెరా దృశ్యాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.