ఉద్యోగుల నిర‌వ‌ధిక‌ స‌మ్మె.. స‌ర్కారుకు నోటీసులు.. జ‌గ‌న్‌కు బిగ్‌ షాక్‌..

త‌గ్గేదేలే అన్నారు ప్ర‌భుత్వ ఉద్యోగులు. ప్రభుత్వానికి స‌మ్మె నోటీసులు ఇచ్చేశారు. ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స‌మ్మె సైర‌న్ మోగిస్తామ‌న్నారు. ఇక జ‌గ‌న్ స‌ర్కారుతో పీఆర్సీపై తాడోపేడో తేల్చుకుంటామ‌ని తేల్చి చెప్పేశారు. 

చ‌ర్చ‌ల పేరుతో బురిడీ కొట్టించాల‌ని చూసిన మంత్రుల గాలానికి చిక్క‌లేదు ఉద్యోగులు. సోష‌ల్ మీడియా బెదిరింపుల‌కూ లొంగ‌లేదు. స‌జ్జ‌ల స‌న్నాయినొక్కుల‌కూ ప‌డిపోలేదు. ప్ర‌భుత్వ ప్ర‌తినిధులుగా మంత్రి బొత్సా చ‌ర్చ‌ల‌కు పిలిచినా.. ఛీ పొమ్మ‌న్నారు. మిమ్మ‌ల్ని న‌మ్మేదే లేదంటూ.. స‌మ్మెపై త‌గ్గేదే లేద‌ని.. నోటీసులు ఇచ్చారు ఉద్యోగ సంఘాల నేత‌లు.

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలదే మెయిన్‌ డిమాండ్‌. లేదంటే, వచ్చే నెల 6 నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో స్ప‌ష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. సీఎస్‌ సమీర్‌ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి నోటీసు అందించారు. 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో తెలిపారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని.. నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో తేల్చిచెప్పారు.