సీఐడీ విచారణకు సజ్జల
posted on May 9, 2025 5:01PM

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ నోటీసుల మేరకు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నారు. ఏ ఫోను వినియోగించారు. ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అంటూ సీఐడీ అధికారులు సజ్జలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 121వ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ కు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ దాడికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సజ్జల, దేవినేనికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ తెరవెనుక కీలక పాత్ర పోషించారనడానికి అవసరమైన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
తెలుగుదేశం కార్యాలయంపై అక్టోబర్ 10, 2021న దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు సరికదా తెలుగుదేశం కార్యకర్తలపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ ఈ దాడి వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉందనీ, ఈ దాడికి తెరవెనుక సజ్జల కీలకంగా వ్యవహరించారనీ నిర్ధారణకు వచ్చింది.