అమరావతి వేదికగా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. చక్రం తిప్పుతున్న ఆర్ఎస్ఎస్ కీలక నేత

బీజేపీ తెలంగాణలో జోరు పెంచింది. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఏ పార్టీ నుంచైనా సరే కమలం గూటికి చేరేవారి గురించి దుర్భిణి పట్టి మరీ గాలిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ ఒక వైపు అదే పనిలో వచ్చేవారూ, రాని వారు అన్న తేడా లేకుండా పార్టీల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని నాయకులందరికీ ఫోన్లు చేసి మరీ కమలం గూటికి రావాలని ఆహ్వానించేస్తున్నారు.

అలా కమలం ఆహ్వానిస్తున్న నేతలలో కాంగ్రెస్ వారు ఉన్నారు, టీఆర్ఎస్ వారూ ఉన్నారు. చివరాఖరికి తెలంగాణలో ఉండీ లేనట్లుగా మిగిలిన వైసీపీ వారూ ఉన్నారు. ఇది చాలదన్నట్లు ఆపరేషన్ ఆకర్ష్ పని కోసం ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోనికి దిగిందని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ కీలక నాయకుడు కూడా కమంల ఆపరేషన్ ఆకర్ష్ కోసం చాలా సీరియస్ గా  పని చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఆరు నూరైనా.. నూరు ఆరైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు. ఒక వైపు తెలంగాణ నుంచి చేరికల కమిటీ చైర్మన్ ఈటల తన పని తాను చేసుకుపోతుంటే.. బీజేపీ మరో వైపు నుంచి అమరావతి వేదికగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి సమాంతరంగా పావులు కదుపుతోంది. వ్యూహాలు రచిస్తోంది. 

ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీలలో గుర్తింపు లేని నాయకులను, అసంతృప్తితో ఉన్న నాయకులనూ, గుర్తింపు ఉన్నా కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభిస్తుందో లభించదో అన్న డైలమాలో ఉన్న నేతలనూ బీజేపీ బీజేపీ వలవేసి పట్టుకుంటోందని అంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.

ఆమె ఆ ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా ఉండి ఆ తరువాత తెరాస గూటికి చేరిన నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావుకు కూడా కమలం పార్టీ నుంచి ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు.  గతంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సందర్బంగా తన కుమార్తె కవిత కోసం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావును ఆయన ఇంటికి వెళ్లి మరీ గులాబి కండువా కప్పారు.

ఆ తరువాత మండవను పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఆయన పరిస్థితి తెరాసలో ఉండీ లేనట్టుగా మారిపోయింది. ఇప్పుడు మండవకు కమలంగూటికి రావల్సిందిగా బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఇలా గతంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించి ఇప్పుడు పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్న నేతలను వెతికి పట్టుకుని మరీ కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సమాచారం. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ జోరును పెంచేందుకు ఏపీలోని అమరావతి వేదికగా వ్యూహాత్మకంగా ఓ ఆర్ఎస్ఎస్ అగ్ర నేత పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. 

ఇప్పటికే  పలువురు నేతలతో ఆయన టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. అలా ఆర్ఎస్ఎస్ నేత ఇప్పటికే సంప్రదించిన వారిలో తెరాస నాయకులే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు.  మండవ వెంకటేశ్వరరావు, జయసుధలతో పాటు కాంగ్రెస్ కు చెందిన రామిరెడ్డి దామోదరరెడ్డి, జగ్గారెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా బీజేపీతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. వీరే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, రసమయి బాలకిషన్, జూపల్లి కృష్ణారావు, రోహిత్ రెడ్డిలను కూడా కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సంప్రదింపులు జరిపిందని చెబుతున్నారు. అమరావతి వేదికగా అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ సంప్రదింపులు సత్ఫలితాలను ఇస్తున్నాయని బీజేపీకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

కాగా మునుగోడు ఉప ఎన్నిక తరువాత ఈ కార్యక్రమం మరింత జోరందుకుంటుందనీ, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలపై బీజేపీ మరింతగా దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. అమరావతి వేదికగాఈ  సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుండటం, అదీ ఓ ఆర్ఎస్ఎస్ కీలక నేత దీనిని పర్యవేక్షిస్తుండటంతో టీఆర్ఎస్ వలసల నివారణకు ఎటు నుంచి ప్రయత్నించాలో కూడా అర్ధం కాని పరిస్థితులలో పడిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో గతంలో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి వలసలను ప్రోత్సహించడమే ఇప్పుడు టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు.  అసంతృప్తులను బుజ్జగించడమెలా, వలసనలను నిరోధించడమెలా అని కేసీఆర్ తల పట్టుకుంటున్నట్లు తెరాస శ్రేణులు అంటున్నాయి.  జూపల్లి కృష్ణారావును బుజ్జగించడానికి కేసీఆర్, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమైన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులలో బీజేపీలోకి వలసలు మరింత పెరిగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.