చిట్టీల పేర శఠగోపం.. వరంగల్ లో భారీ మోసం
posted on May 3, 2022 7:07AM
చిట్టీల పేర మోసాల సంఘటనలు ఎన్ని జరిగినా అమాయక జనం వంచనకు గురవడం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బ్యాంకులలో వడ్డీ అంతకంతకూ తక్కువ అవుతుండటం, బ్యాంకు లావాదేవీలు గ్రామీణులకు ఒకింత సంక్లిష్టంగా అనిపించడంతో.. నమ్మకస్తులే కదాని తమ పొదుపునకు చిట్టీ పాటదారులను ఆశ్రయిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల నిర్వాహకులు కోట్లాది రూపాయలకు ఎగనామం పెట్టేసి తమ వద్ద చిట్టీలు వేసిన వారి నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘరానా మోసం వరంగల్ లో జరిగింది. నగరంలోని టీఆర్టీ కాలనీలో ఓ చిట్టీల నిర్వాహకులు ఏకంగా 30 కోట్లతో పరారయ్యాడు.
గత పదేళ్లుగా కాలనీలోనే ఉంటూ చిట్టీలు నిర్వహిస్తూ స్థానికుల నమ్మకాన్ని చూరగొన్న మూడెడ్ల వెంకటేశ్వర్లు హఠాత్తుగా రూ.30 కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. పదేళ్లుగా చిట్టీలు సక్రమంగా నిర్వహిస్తుండటంతో అతడిని నమ్మి, అధిక వడ్డీ ఆశతో రూ. లక్షలు ముట్ట చెప్పారు. అయితే గత కొద్ది కాలంగా మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. పాడుకున్న వారికి చిట్టీ డబ్బులు తరువాత తరువాత అంటూ వాయిదా వేయడం, అలాగే డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తుండటంతో స్థానికులు ఆయనను గట్టిగా నిలదీశారు. దీంతో మూడెడ్ల వెంకటేశ్వర్లు దైవదర్శనం పేరు చెప్పి కుటుంబంతో సహా పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితులు లేబర్ కాలనీలోని యాజమాని ఇంటి ఎదుట నిరసనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నవెూదు చేసి విచారణ చేపట్టారు.