బుల్లి తెరపై ఇక రోజా స్టెప్పులు!
posted on Feb 25, 2025 1:34PM

మాజీ మంత్రి రోజా.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1998లో తెలుగుదేశం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున 2004 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచీ పోటీ చేశారు. అయితే ఆ రెండు సార్లూ రోజా పరాజయం పాలయ్యారు.
వరుసగా రెండు ఎన్నికలలోనూ ఓడిపోయినా చంద్రబాబు ఆమెకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. కానీ రోజా మాత్రం తన దూకుడుతోనూ, వ్యవహార శైలితోనూ పార్టీలో ముఖ్యనేతల నుంచి, క్యాడర్ వరకూ అందరి నుంచీ వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఫలితంగా ఆమె తెలుగుదేశం పార్టీకి దూరమై 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రోజాకు అవకాశం దక్కింది. టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.
అప్పటి వరకూ ఆమె రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నా సినిమాలూ, స్మాల్ స్క్రీన్ ప్రజెన్స్ లను వదల లేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ అనే కామేడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. సినిమా హీరోయిన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, అంత కంటే ఎక్కువగా జబర్దస్త్ జడ్జిగా పేరు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాలలో చెప్పారు. అదే సమయంలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయి ఉండీ జబర్దస్త్ లో వెకిలి జోకులకు పగలబడి నవ్వడాలేంటన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. అది వేరు సంగతి. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఆమె జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు.. ఇకపై టీవీ షోలు సినిమాలూ చేయను ప్రజలకే నా జీవితం అంకితం అంటు ప్రతిజ్ణ కూడా చేశారు.
అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కల కల్ల అయిపోయింది. ఆమె నగర నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆమె మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీంతో గతంలో ఇక సినిమాలు, టెలివిజన్ షోలు చేయను అన్న ప్రతిజ్ణను పక్కన పెట్టేసి మళ్లీ బుల్లి తెరపై రీఎంట్రీకి సిద్ధమైపోయారు.
నగరిలో ఓటమి పాలు అయిన తరువాత రోజా మళ్లీ జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఆమె జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ, బుల్లి తెర ఎంట్రీ మాత్రం ఫిక్సై పోయింది. ఒక ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షోకు రోజా జడ్జిగా వ్యవహరించనున్నారు. ఆ షోకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా రిలీజ్ అయ్యింది. దీంతో అయితే మంత్రి లేకుంటే టీవీ షోలు అన్నట్లుగా రోజా తీరు ఉందన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.