పుట్టలో వేలు పడితే చీమ కుట్టదా.. వర్షాలు పడితే రోడ్డు పాడవ్వదా.. !

ఆడలేక మద్దెలోడు అన్నట్లుంది వైసీపీ తీరు. వైసీపీ హయాంలో ఏపీలో రోడ్లు ధ్వంసం కావడానికి కారణం వర్షాలట. అదే చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో వర్షాలు పడలేదు కనుక రోడ్లు పాడు కాలేదట. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన వైసీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన మహా రహస్యమిది.

ప్లీనరీలో మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ  జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో 95శాతం నెరవేర్చిందని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో అయితే ఇచ్చిన హామీలలో అధిక శాతం హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. పుట్టలో వేలెడితే కుట్టనా అన్నదట చీమ.. అలాగే వర్షాలు పడితే రోడ్లు పాడవ్వవా అంటున్నారు

పెద్ది రెడ్డి. కరోనా కారణంగా గత రెండేళ్లూ ప్లీనరీ జరుపుకోలేకపోయామనీ, ఈ ఏడాది జూలై 8, 9 తేదీలలో వైసీపీ ప్లీనరీ ఘనంగా జరుపుకుంటామని అన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాను పొల్గనకపోవడంపై విపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నాయనీ, తనకు బాధ్యతలు ఎక్కువ కావడం వల్లనే గడపగడపకూ వెళ్లలేకపోయాననీ అన్నారు.

అయినా తాను గడప గడపకూ వెళ్లడమెందుకు.. నేరుగా సమస్యలు తనకు తెలియజేస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు.  గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో 95 శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని అందుకే రోడ్లు పాడౌతున్నాయని పెద్దిరెడ్డి వెల్లడించారు. అయినా పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు.