Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహాయతి కూటమిలో ముసలం.. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఏక్ నాథ్ నో ఇన్విటేషన్
posted on: Jun 9, 2026 9:55AM
.webp)
మహారాష్ట్ర రాజకీయాల్లో మిత్ర భేదం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమం కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలకు కేంద్రబిందువుగా మారింది. మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విమానాశ్రయ ప్రాజెక్టును పర్యవేక్షించే అత్యున్నత ప్రభుత్వ సంస్థ సీఐడీసీవో నేరుగా షిండే నేతృత్వంలోని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తుంది. అయినా.. ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందకపోవడం సంచలనంగా మారింది.
ఈ వేడుకను అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ, సీఐడీసీవో సంయుక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై.. 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేదికపై రాష్ట్ర మంత్రులు గణేశ్ నాయక్, అదితి తత్కరేలు ఉన్నారు. అయితే.. డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండేతో పాటు సునేత్రా పవార్‌లకు కనీసం ఆహ్వానం కూడా అందకపోవడంతో వారు రాలేదు. దీంతో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నది. కొందరు ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు క్రెడిట్ ఏక్‌నాథ్ షిండేకు దక్కకుండా చేసేందుకేఆయనకు ఆహ్వానం కూడా పంపకుండా తెరవెనుక కుట్ర జరిగిందనీ మంత్రి సంజయ్ శిర్సాత్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత అంబాదాస్ దాన్వే మహాయుతి కూటమిలో అసలు ఏక్‌నాథ్ షిండే ప్రాధాన్యత మరియు ఆయన స్థానం ఏంటో ఈ సంఘటనతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కూటమిలో ముసలం ముదిరిపోయిందన్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి, ఉప ముఖ్యమంత్రులను ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దూరం పెట్టడంపై 24 గంటల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ సీఐడీసీవో, అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో.. క్రెడిట్ రాజకీయం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.


.webp)



