రేవంత్ రెడ్డిని ఢీకొట్టేదెలా? కేసీఆర్ తో బీజేపీ పెద్దల చర్చ? 

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మూడు నెలల క్రితం పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి సీన్ మారిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత ఒకలా రాజకీయం మారిపోయిందంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ కనిపించిందని, ప్రస్తుతం మాత్రం బీజేపీ వెనకబడి పోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల ముందు నిలవలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న దళిత గిరిజన దండోరా సభలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుందని అంటున్నారు. ఇక సెప్టెంబరు 17న బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించాయి. నిర్మల్ లో జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అదే రోజు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. రెండు పార్టీలు సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జనాలు కూడా ఆసక్తి కనబరిచారు. 

అయితే నిర్మల్ బీజేపీ సభ కంటే రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకే జనాలు ఎక్కువగా వచ్చారు. ఇదే ఇప్పుడు బీజేపీకి ఇబ్బందిగా మారింది. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీలో ఊహించని ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని భావించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమని కూడా కమలనాధులు చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో పొలిటికల్ సీన్  కూడా టీఆర్ఎస్ కు బీజేపీనే పోటీ ఇస్తుందనేలా కనిపించింది. అందుకే కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు కాషాయ గూటికి చేరారు. కాని రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడంతో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. వరుసగా నిర్వహిస్తున్న సభలతో ఆ పార్టీ కేడర్ యాక్టివ్ అయింది. 

రేవంత్ రెడ్డి దూకుడుతో బీజేపీ అంచనాలు తప్పాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు  పోటీ మళ్లీ కాంగ్రెస్ అనేది ప్రజలకు అర్ధమైందని అంటున్నారు పరిశీలకులు. రేవంత్ దెబ్బకు తెలంగాణలో బీజేపీ వెనుకకు వెళ్లిందనే చర్చ సాగుతుంది. బీజేపీ నేతల అభిప్రాయం కూడా ప్రస్తుతం అలానే ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకు కాంగ్రెస్ బలపడుతుండటంతో కమలం నేతల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది.  రేవంత్ దెబ్బకు మనం పుంజుకోవడం కష్టమేనని.. బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని నిలువరించాలంటే.. ఏం చేయాలనే విషయంపై బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిని ఎలా కట్టడి చేయాలనే  విషయంలో సీఎం కేసీఆర్ కూడా బీజేపీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీనిపై బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లు చెబుతున్నారు. రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. ఓటు కు నోటు కేసును తిరిగదోడాలనే చర్చ కూడా వచ్చిందని అంటున్నారు.  ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు రేవంత్ రెడ్డి. కేసును తిరగతోడి బెయిల్ రద్దు చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య  వచ్చిందంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిని మరోసారి జైలుకు పంపిస్తే.. ఆయనకు మైలేజీ మరింత పెరిగే అవకాశం ఉందనే వాదన కూడా కొందరు నేతల నుంచి వచ్చిందట. దీంతో రేవంత్ రెడ్డికి ఎలా బ్రేకులు వేయాలన్న అంశంపై కమలనాధులు సీరియస్ గా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. చూడాలి మరీ.. ఏం జరుగుతుందో...