ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కేసీఆర్ కు ఇక చుక్కలేనా? 

తెలంగాణ కాంగ్రెస్ లో అంతా సెట్ రైట్ అయిందా? సీనియర్లంతా ఒక్కటైపోయారా? కలిసికట్టుగా పోరాడుతూ కేసీఆర్ కు చుక్కలు చూపించబోతున్నారా? అంటే కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకో గాంధీభవన్ లో ఖుషీ వాతావరణం కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎడమొఖం పెడ మొఖంగా ఉన్న నేతలంతా కలిసిపోయారు. ఇందుకు పీసీసీ చేపట్టిన వరి దీక్ష వేదికైంది. కొంత కాలంగా భిన్న దృవాలుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలుసుకోవడం చర్చగా మ మారింది. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపింది. 

వరి దీక్ష వేదికగా కలిసిపోయిన ఆ ఇద్దరు నేతలో ఎవరో కాదు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు కలిసిపోయారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ  ధర్నాచౌక్‌లో రెండు రోజుల‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే. ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒకరంటే ఒకరికి పడని.. ఒక్కసారీ మాట్లాడుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు... కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది.ఈ సన్నివేశం చూసిన జనాలు, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఒకింత ఆశ్చర్యపోయింది. 

టీపీసీసీ చీఫ్‌ కోసం విశ్వప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి.. ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాదు రేవంత్ రెడ్డి టార్గెట్ గా వరుస ప్రకటనలు చేసి కాక రాజేశారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ పార్టీ ఇంచార్జీనే టార్గెట్ చేశారు. తర్వాత కూడా సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ లక్ష్యంగా కామెంట్లు చేశారు కోమటిరెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీకి డిపాజిట్ రాకపోవడంతో.. అందుకు పీసీసీ చీఫ్ కారణమనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే వాళ్లిద్దరి మధ్య సయోధ్య కోసం సీనియర్ నేత వీ హనుమంతరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు.

రక్తం ధార పోసేందుకు సిద్ధమేనా.. తెలంగాణ‌కు మంచి రోజులు..

కొన్ని రోజుల క్రితం సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు వీహెచ్. తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ చర్చించారు.  ఈ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో వీహెచ్ ఫెయిల్ అయినప్పటికీ..  వరి దీక్షతో కోమటిరెడ్డి-రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయ్యింది. అయితే ఇద్దరూ కలిసిపోయినట్టేనా..? లేకుంటే దీక్ష ముగిసే వరకు మాత్రమే ఇలా కలిసుంటారా..? అన్నదానిపై పార్టీ నేతలెవరు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి దీక్షలో కూర్చున్న విజువల్స్ మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తెగ వైరల్ చేస్తోంది. ఆ ఇద్దరూ కలిసిపోయారు.. ఇక కాస్కో కేసీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేస్తే గులాబీ పార్టీకి చెమటలు పట్టడం ఖాయమనే చర్చ గాంధీభవన్ తో పాటు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.