కేటీఆర్ తన వెంట్రుకతో సమానమన్న రేవంత్ రెడ్డి..

తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత రాజుకుంది. మంత్రి కేటీఆర్, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరస్పర సవాళ్లు, హాట్ కామెంట్లు కాక రేపుతున్నాయి. డ్రగ్స్ వాడేవాళ్లకు కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అంటూ  రేవంత్ చేసిన ఆరోపణలపై రచ్చ ముదురుతోంది. టెస్టుకు తాను సిద్ధమని, అయితే తనతో పాటు రాహుల్ గాంధీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి రావాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ విసిరిన సవాల్ కు రేవంత్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని... సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కుంభకోణాల్లో సీబీఐ కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. కేసీఆర్ సిద్ధమైతే టెస్టుకు తాను కూడా సిద్ధమని... టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద వేచి చూస్తుంటానని... దమ్ముంటే రావాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. 

అన్నట్లుగానే గన్ పార్క్ దగ్గరకు వచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది? అని ప్రశ్నించారు. మంచి ట్రాక్ రికార్డు ఉన్న అకున్ సబర్వాల్ ను డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే ఎందుకు తప్పించారని రేవంత్ నిలదీశారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయని, విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైందని అన్నారు. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు’’ అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మీ ఆస్తులు అడగడం లేదు. రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ని ఈడీ పిలిచింది. వాళ్ళని నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని అన్నారు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారు.. కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే‌గా కేవలం 100 ఓట్లతోనే గెలిచావు అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. 

రాజకీయాల పరంగా చూస్తే కేటీఆర్  తన వెంట్రుకతో సమానమంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. డ్రగ్ టెస్టుకు సిద్ధమని చెప్పి తోక ముడిచారని మండిపడ్డారు. డ్రగ్స్ టెస్టుకి రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్.. ఇవాంక ట్రంప్‌ని కూడా రమ్మని అడుగుతారేమో అంటూ సెటైర్లు వేశారు.  డ్రగ్స్‌తో నీకు సంబంధం ఉందని అన్నామా. నువ్వే డ్రగ్స్ టెస్టుకు సిద్ధమేనని సవాల్ చేశావు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ సవాల్ నేను స్వీకరించకపోతే... జనానికి అనుమానం వస్తుంది. ఆయన చెప్పిన మాటలకు నేను వైట్ ఛాలెంజ్ అని విసిరా. కేటీఆర్‌ని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే. కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్‌గా మారిపోయాడని రేవంత్ విమర్శించారు.

మరోవైపు సిటీ సివిల్‌కోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు