హుజురాబాద్ పై రేవంత్ మాస్టర్ ప్లాన్.. వర్కింగ్ ప్రెసిడెంట్లకు రూట్ మ్యాప్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు స్పీడ్ పెంచిన కమలనాధులకు ధీటుగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ కమిటి కూర్పుపైనా ఫోకస్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను మరింత యాక్టివ్ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. కాంగ్రెస్‌లోని అనుబంధ సంఘాలను కలుపుతూ ఐదుగురికి బాధ్యతలను టీపీసీసీ అప్పగించింది.

మహేశ్ గౌడ్‌కు పార్టీ ఆర్గనైజేషన్‌తో పాటు చేవేళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగించారు. మాజీమంత్రి, సీనియర్ నాయకురాలు గీతారెడ్డికి సికింద్రాబాద్, నల్లగొండ, హైదరాబాద్ స్థానాల బాధ్యతతోపాటు ఎన్ఎస్‌యూఐ బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు అదిలాబాద్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, సోషల్ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గాల బాధ్యతలతో పాటు మహిళా కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలోని నాయకులకు పని విభజన చేయాలని పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి భావించారు. ఇదే విషయాన్ని నేతలకు వివరించారు. ఇందుకు నేతలు కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. రాబోయే రోజుల్లో మరికొందరు కీలక నేతలకు కూడా పలు బాధ్యతలు అప్పగించి.. అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేేయడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపైనా టీపీసీసీ గురి పెట్టింది. ఇప్పటికే హుజురాబాద్ కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కమిటిని నియమించారు. బుధవారం హుజురాబాద్ పై గాంధీభవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు. అభ్యర్థి ఎంపికతో పాటు ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కారెక్కారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇంచార్జ్ లేరు. ఈ విషయంలోనూ బుధవారం భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.