సంజయ్ పాదయాత్రకు కాంగ్రెస్  కౌంటర్! రేవంత్ రెడ్డి దళిత దండోరా..

తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అన్ని పార్టీలో పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగానే ఎత్తులు వేస్తున్నాయి. ఆగస్టు 9 నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. చార్మీనార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభించనున్న సంజయ్.. హుజురాబాద్ భారీ బహిరంగ సభతో ముగించనున్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో జోష్ మీదున్న కాంగ్రెస్ కూడా వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయితే బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టనున్న రోజే కాంగ్రెస్ ప్రొగ్రామ్ ఉండేలా రూట్ మ్యాప్ ప్రకటించారు. దళిత బంధు పథకం పేరిట సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కార్యాచరణను టీపీసీసీ ప్రకటించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు ‘దళిత దండోరా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత గిరిజన దండోరా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

ఆగస్టు 9న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా నిర్వహిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా?.. 118 నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఓట్ల కోసం దళితులను మోసం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు.