కేటీఆర్ ఓ బచ్చా... దమ్ముంటే చర్చకు రా! రేవంత్ రెడ్డి కౌంటర్.. 

తెలంగాణ రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. రాజకీయ వేడి రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వక్తిగత దూషణలు, సవాళ్లతో హీటెక్కిస్తున్నారు లీడర్లు. తనను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఓ బచ్చా అన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే  నవంబర్ 15 లోపు తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు రేవంత్ రెడ్డి. 

కేటీఆర్ అన్నింటిలోనూ  తన కంటే జూనియర్ అన్నారు రేవంత్ రెడ్డి. తాను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున్ని అయితే కేటిఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారన్నారు. తాను  రాజకీయాల్లో జడ్పీటీసీ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా , ఎంపీగా పని చేశానని చెప్పారు. రాజకీయాలు, పదవులు, పార్టీలు ఎక్కడ చూసినా కేటీఆర్ తనతో సమానం కాదన్నారు రేవంత్ రెడ్డి. ఏ విషయంలో చర్చకు అయినా తాను సిద్ధమని, కేటిఆర్ కు దమ్ముంటే చర్చలకు రావాలని, మొఖం చాటేయ్యొద్దని  రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 

సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తుందన్నారు. తిరుగుబాటు వస్తుందని తెలుసు కాబట్టే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. కాని తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని రేవంత్ రెడ్డి చెప్పారు. గుజరాత్ తో పాటు తెలంగాణలోఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కూడా చెప్పారు. బీజేపీతో కేసీఆర్ కలిసి డ్రామా చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 

రేవంత్ రెడ్డి కామెంట్లకు మంగళవారం కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో తప్పకుండా తెరాస గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.