రేవంత్ ఒంటరి పోరాటం?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్’లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో, ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. నిజానికి, రాష్ట్ర విభజన జరిగితే ఏపీలో ఏమి జరుగుతుందో కాంగ్రెస్ నాయకత్వానికి ముందే తెలుసు. అయినా, భారీమూల్యం తప్పదని తెలిసినా,తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, ప్రధానంగా యువకుల ఆత్మ బలిదనాలను నిరోధించేందుకు, కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించారు. ఒక విధంగా ఆ రోజున ఆమె చాలా  ధైర్యంగా  సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అయినా, ఆరు పదుల తమ ఆకాంక్షను నెరవేర్చినా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. తెలంగాణ యిచ్చింది, కాంగ్రెస్ పార్టీనే అయినా, తెచ్చిన తెరాస (?) కే ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమాన్ని  ముందుండి నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇక అక్కడి నుంచి కుటుంబ సామ్రజ్య స్థాపనపై దృషి పెట్టిన కేసీఆర్, రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం పైనే దృష్టిని కేంద్రీకరించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బ తీశారు. తెలంగాణ ఇస్తే, తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాటిచ్చిన కేసీఆర్, తెరాసను కాంగ్రెస్’లో విలీనం చేయలేదు కానీ, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం’ అయితే చేశారు. సామదానదండోపాయాలు ప్రయోగింఛి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస లోకి తోలుకు పోయారు. ఒకరు ఇద్దరు కాదు, మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను గులాబీ గూటికి తరలించారు. చివరకు, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కుడా దక్కకుండా చేశారు. 

ఒక విధంగా కాంగ్రెస్ కథకు ముగింపు పలికారు. అయితే, అనూహ్యంగా, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో, కేసీఆర్ గేమ్ ప్లాన్’ కు బ్రేకులు పడ్డాయి. పడిలేచిన కెరటంలా, కాంగ్రెస్ పార్టీ ఎగిసి పడింది కేసీఆర్’కు సవాలు విసురుతోంది. అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బతికించారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆందోళనలు చేపట్టారు. రేవంత్ రెడ్డి శ్రమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది. తెరాసకు ప్రత్యాన్మాయంగా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగింది. 

ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్ పనైపోయిందని ఇతర పార్టీలలోకి వెళ్ళిన నాయకులు, అధికార తెరాస పార్టీ నేతలు కూడా ఇప్పడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే, రేవంత్  రెడ్డి పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు శక్తికి మించి పనిచేస్తుంటే, ఇతర  కీలక నేతలు కొందరు,  పార్టీని నడిపించే బాధ్యత తమకు లేదన్నట్లు వ్యహరిస్తున్నారు.  మరో వంక పనిగట్టుకుని కొదంరు నేతలు అంత‌ర్గ‌త కుమ్ములాటాలు తెచ్చి చోద్యం చూస్తున్నారు.దీంతో రాష్ట్రంలో కాంగెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా త‌యారైందనే మాట రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. అందుకే పార్టీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. పదేళ్ళ తర్వాత అందివచ్చిన అవకాశం చేజారి పోతుందేమో అనే ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది 

తాజాగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మళ్లీ రచ్చకెక్కింది. రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో రచ్చబండ రచ్చరచ్చగా మారింది. మరోసారి ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ  నేత సుభాష్ రెడ్డి,  జ‌హిరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మ‌ద‌న్ మోహన్ రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. అయితే ఇది ఇప్పుడే పుట్టిన సమస్య కాదు. ఈ ఒకక్ జిల్లా సమస్య మాత్రమే కాదు.  ఈ ఇద్దరి సమస్య మాత్రమే కాదు. ఇదొక ఉదాహరణ మాత్రమే.  చాలా వరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పాత ఉత్సాహంతో పాటుగా పాత కక్షలు, ముఠా కుమ్ములాటలు కూడా పైకొస్తున్నాయి. ఈ అన్నిటి కంటే, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు తెరాస కోవర్టుల వలన సమస్యలు తప్పడం లేదని,పార్టీ నాయకులు కొందరు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక విషయంలో తెరాస కోవర్టులు చక్రం తిప్పే ప్రమాదం ఉందని, గతంలోనూ అదే జరిగిందని పార్టీ నాయకులు అంటున్నారు. ఒకప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిష్కారం చూపేది, ఇప్పడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని, అందుకే రేవంత్ రెడ్డి మీద భారం ఎక్కువ పడుతోందని అంటున్నారు. ఒక విధంగా చూస్తే, ఇటు రాష్ట్ర నేతల నుంచి సహకారం లేక అటు కేంద్ర నాయకత్వం, ‘సొంత’ సమస్యల చట్రంలోంచి బయట పడే పరిస్థితి లేక  రేవంత్ రెడ్డి  ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదని అంటున్నారు.