ఈసారి రిప‌బ్లిక్ డే ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ఔరా అనిపించాల్సిందే..

దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ ప‌తాకానికి వందనం చేసి వేడుకలు ప్రారంభించారు. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. 

2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు మ‌ర‌ణానంత‌రం అశోక్‌ చక్ర పురస్కారం వరించింది. బాబురామ్‌ కుటుంబసభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు.   

రాజ్‌పథ్‌లో రిప‌బ్లిక్ డే పరేడ్ వేడుక‌గా జ‌రిగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో పరేడ్‌ ఆకట్టుకుంది.   

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి.  

రిపబ్లిక్‌ డే కవాతులో మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు జరిగాయి. పాత విమానాల నుంచి ఆధునిక రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్ ఫైట‌ర్ జెట్‌లు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాయి. 

ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ను ప్రారంభిస్తారు. ఈసారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా వేడుక‌లు స్టార్ట్ చేశారు. 

దేశవ్యాప్తంగా పోటీల్లో ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వ‌హించారు. 

రక్షణ, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాలు ప్రదర్శించారు.  

రాజ్‌పథ్‌ మార్గంలో ఇరువైపులా పది భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలను ప‌రేడ్ ప్రారంభానికి ముందు ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించారు.  

అంత‌కుముందు, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ఇండియాగేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వందనం చేశారు.