బీజేపీలోకి పొంగులేటి? మ‌ధ్య‌లో జ‌గ‌న్‌కేటి?

మాజీ ఎంపీ, ఒక‌ప్ప‌టి వైసీపీ నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌రెడ్డిని క‌లిశారు. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. మామూలుగా అయితే ఇది కామ‌న్ న్యూసే. కాక‌పోతే, పొంగులేటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయ‌కుడు కావ‌డ‌మే కాస్త ఆస‌క్తిక‌రం. మ‌రి, ఆ ఖ‌మ్మం జిల్లా కారు పార్టీ లీడ‌ర్‌కు.. తాడేప‌ల్లిలో ఏం ప‌ని? జ‌గ‌న్‌తో ర‌హ‌స్య భేటీ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఏముంది? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

పొంగులేటి ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారంతే. పూర్తిగా స్థ‌బ్దుగా.. పార్టీతో ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నారు. 2014లో ఖ‌మ్మం పార్ల‌మెంట‌రీ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీకి వ‌చ్చిన ఏకైనా సీటు అదొక్కొటే. ఆ త‌ర్వాత అంద‌రిలానే.. ఆయ‌న సైతం అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కారులో ఓ మూల‌న స‌ర్దు కున్నారు. అయితే, ఆ స‌ర్దుబాట్లు కుద‌ర‌క‌.. కారు ఓవ‌ర్ లోడ్ కావ‌డంతో.. గ‌త ఎన్నిక‌ల్లో పొంగులేటికి గులాబీ పార్టీ టికెటే ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి.. ఆయ‌న‌కు పార్టీలో ప్రాధాన్యం లేదు. 

ప‌వ‌ర్ లేనిదే లీడ‌ర్లు క్ష‌ణం కూడా ఉండ‌లేరు. అలాంటిది.. దండిగా డ‌బ్బులుండి.. చేతినిండా ప‌లు ప్రాజెక్టులు ఉండి.. ప‌వ‌ర్ లేక‌పోయే సరికి.. తెగ ఇబ్బంది ప‌డుతున్నారాయ‌న‌. క‌నీసం వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లోనైనా త‌న‌కేదైనా స్థానం ఇస్తారా? అంటే ఆ న‌మ్మ‌క‌మూ లేదాయే. దీంతో.. కారు దిగేసి.. కాంగ్రెస్‌లో చేరేందుకు ట్రై చేశారు.. కానీ, హ‌స్త‌వాసి అస‌లేమాత్రం బాగాలేద‌ని గుర్తించి.. కారుకే కాంప్ర‌మైజ్ అయ్యారు. లేటెస్ట్‌గా బీజేపీకి బూస్ట్ రావ‌డంతో.. అటువైపు చూస్తున్నారని అంటున్నారు. అయితే, బీజేపీలో చేరినా.. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌ష్ట‌మేన‌ని లెక్క‌లేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్‌లో ఇమ‌డ‌లేక‌.. వేరే పార్టీలోకి వెళ్ల‌లేక తెగ ఇదై పోతున్నారు పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి. 

ఇలాంటి సందిగ్థ ప‌రిస్థితుల్లో పొంగులేటి.. లేటెస్ట్‌గా త‌న మాజీ బాస్ జ‌గ‌న్‌రెడ్డిని క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ఊహాగానాల‌కు కార‌ణ‌మైంది. మీరు రెడ్డి.. నేను రెడ్డి.. మ‌నం మ‌నం రెడ్డి-రెడ్డి అంటూ.. వ్యాపార విష‌యాల‌తో పాటు రాజ‌కీయ అంశాలు చ‌ర్చించార‌ని అంటున్నారు. కాస్త కేసీఆర్‌కు నా గురించి చెప్పండి బాస్‌.. అంటూ జ‌గ‌న్‌ను రిక్వెస్ట్ చేశార‌నేది ఒక టాక్‌. జ‌గ‌న్‌తో చెప్పించుకొని.. బీజేపీలో బిగ్ పోస్ట్ కొట్టేయాల‌నేది ఇంకో లీక్‌. రెండిట్లో ఏది రియ‌లో.. ఏది వైర‌లో తెలీదు కానీ.. పొంగులేటి జ‌గ‌న్‌రెడ్డిని క‌ల‌వ‌డం వెనుక ఏదో లెక్క ఉండే ఉంటుంద‌ని అంటున్నారు.