అందుకేనా సాగ‌ర్ టూర్‌!? కేసీఆర్‌ను అంత ఈజీగా న‌మ్మేస్తారా?

ఉరుము ఉర‌మ‌లేదు. మెరుపు మెర‌వలేదు. రాజ‌కీయ‌ సూచ‌న‌లేవీ లేవు. అయినా, మెరుపులా నాగార్జున‌సాగ‌ర్‌లో మెరిశారు సీఎం కేసీఆర్‌. కేవ‌లం ఎన్నిక‌ల వేళ త‌ప్పితే.. గెలిచాక అటువైపు క‌న్నెత్తి కూడా చూసే అల‌వాటులేని కేసీఆర్‌.. రాజ‌కీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు. హామీలు ఇవ్వ‌డం.. ఆ త‌ర్వాత మ‌ర్చిపోవ‌డం.. అడిగితే ముఖం చాటేయ‌డం.. ఇదే ఆయ‌న‌కు అల‌వాటు అంటారు. అలాంటిది స‌డెన్‌గా నాగార్జున సాగ‌ర్‌లో ప‌ర్య‌టించి.. గ‌త ఉప ఎన్నిక స‌మ‌యంలో తాను ఇచ్చిన హామీలు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చాయంటూ స‌మీక్షించ‌డం.. వాటిని నెర‌వేర్చ‌డానికి డెడ్‌లైన్ పెట్ట‌డం.. ఆశ్చ‌ర్యంతో కూడిన ఆస‌క్తిక‌ర విష‌య‌మే. కేసీఆర్‌లో ఇంత‌టి మార్పుకు కార‌ణం ఏమై ఉంటుంద‌ని తెగ చ‌ర్చించుకుంటున్నారు జ‌నాలు.

ద‌ళిత ముఖ్య‌మంత్రి, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి నుంచి నిరుద్యోగ భృతి వ‌ర‌కూ ఏడేళ్లుగా ఒకేర‌క‌మైన ఎన్నిక‌ల స్టంట్‌. నోటికొచ్చిన హామీల‌న్నీ గుప్పించు.. గంప‌గుత్త‌గా ఓట్ల‌ను కొల్ల‌గొట్టు. ఇదే స్ట్రాట‌జీ. అందుకే, హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ‌.. కుటుంబానికి 10 ల‌క్ష‌లంటూ ద‌ళిత‌బంధు ప్ర‌క‌టించినా కూడా ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. కేసీఆర్‌ను న‌మ్మొచ్చా? నిజంగా ఇస్తారంటారా? ఎల‌క్ష‌న్ ఉంది కాబ‌ట్టి హుజురాబాద్‌లో ఇచ్చినా.. ఆ త‌ర్వాత మిగ‌తా జిల్లా ద‌ళితుల‌కు మొండిచేయి చూపిస్తారా? అనే అనుమానాలు చాలామందిలో. ఎందుకంటే, సీఎం కేసీఆర్ హామీల గ‌త చ‌రిత్ర అలాంటిది మ‌రి. అందుకే కాబోలు, ద‌ళిత బంధు అన‌గానే ఆ వ‌ర్గమంతా కేసీఆర్ ఫోటోల‌కు పాలాభిషేకాలు, ఊరేగింపులు గ‌ట్రా పెద్ద‌గా చేయ‌ట్లేదు. జ‌స్ట్ విని.. ఊర‌క ఉండిపోయారంతే. ఇచ్చిన‌ప్పుడు చూద్దాం.. ఇస్తే తీసుకుందాం.. అన్న‌ట్టుగానే ఉన్నారు.  

ప్ర‌జ‌లు క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నిక‌లు ముగిశాక ద‌ళిత‌బంధును అట‌కెక్కించడం ఖాయ‌మంటూ జోరుగా ప్ర‌చారం చేస్తున్నాయి. సోష‌ల్ మీడియా అంతా కేసీఆర్ చిత్త‌శుద్ధిని శంకిస్తోంది. ముఖ్య‌మంత్రిని శ‌ల్య‌ప‌రీక్ష‌కు గురిచేస్తోంది. ఇక ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ, బీజేపీ అనుకూల‌ ఛానెల్‌లోనైతే రోజూ ఇదే న్యూస్‌. హుజురాబాద్‌లో ఎన్నిక‌లు ఉన్నాయ‌నే కేసీఆర్ ఇలాంటి హామీలు ఇస్తున్నార‌ని.. ఇటీవ‌ల నాగార్జున సాగ‌ర్ బైపోల్ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల‌కు ఇప్ప‌టికీ అతీగ‌తీ లేదంటూ దాదాపు ప్ర‌తీరోజూ ఊద‌ర‌గొడుతోంది ఆ మీడియా. 

నాగార్జున సాగ‌ర్‌లో ఏయే హామీలు ఇచ్చారు.. ఏయే మండ‌లానికి ఎన్నెన్ని కోట్లు ఇస్తాన‌న్నారు.. అంటూ కేసీఆర్ ఆనాడు మాట్లాడిన ప్ర‌సంగాన్ని ప‌దే ప‌దే చూపిస్తున్నారు. తెలంగాణ‌లో బాగా వ్యూయ‌ర్‌షిప్ ఉన్న ఛానెల్ కావ‌డంతో.. ఆ మేట‌ర్ జ‌నాల్లోకి బాగా వెళుతోంది. నిజ‌మే క‌దా.. సాగ‌ర్‌లో గెల‌వ‌డానికి కేసీఆర్ అన్నిమాట‌లు చెప్పారుక‌దా.. ఆ త‌ర్వాత ఆ ఊసే లేదుక‌దా.. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ అలానే చేస్తున్నారు క‌దా.. ఎన్నిక‌ల త‌ర్వాత హుజురాబాద్‌కు సైతం నాగార్జున సాగ‌ర్ గ‌తే ప‌డుతుందా? అంటూ కేసీఆర్‌పై అనుమానాలు పెరిగిపోయాయి. ఈ విష‌యం ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా ప‌సిగ‌ట్టిన ముఖ్య‌మంత్రి.. క్ష‌ణం ఆలోచించ‌కుండా.. వెంట‌నే నాగార్జున సాగ‌ర్ టూర్ పెట్టుకున్నార‌ని అంటున్నారు. 

స‌డెన్‌గా సాగ‌ర్‌లో వాలిపోయారు సీఎం కేసీఆర్‌. త‌న‌కు క‌రోనా రావ‌డం వ‌ల్ల ఇన్నాళ్లూ రాలేక‌పోయానంటూ ముందే క‌వ‌రింగ్ ఇచ్చుకున్నారు. ఎప్పుడో తానిచ్చి మ‌ర్చిపోయిన హామీల గ‌తేందంటూ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి 150 కోట్లు.. హాలియా, నందికొండ అభివృద్ధికి వేరువేరుగా 15కోట్లు.. హాలియాలో డిగ్రీ కాలేజ్‌, మిని స్టేడియం నిర్మాణం.. అక్ర‌మిత భూముల్లో ఉన్న‌వారికి ప‌ట్టాలు.. బంజారా భ‌వ‌నం.. ఇలా పాత హామీల‌ను కొత్త‌గా మ‌రోసారి ప్ర‌క‌టించేసి త్వ‌ర‌లోనే వాటిని నెర‌వేరుస్తానని స్ప‌ష్టం చేశారు. ప‌నిలో ప‌నిగా కృష్ణా జ‌లాలు, ఏపీ దాదాగిరి అంటూ కాస్త సెంటిమెంట్ మ‌సాలా కూడా యాడ్ చేశారు. ఇక‌, ద‌ళిత‌బంధు ప‌థ‌కం గొప్ప‌ద‌నంపై హాలియా బ‌హిరంగ స‌భ‌లో ఘ‌నంగా ప్ర‌స్తుతించారు.

ఇలా, ఎన్నిక‌ల త‌ర్వాత సీఎం కేసీఆర్ నాగార్జున సాగ‌ర్‌ను పట్టించుకోలేద‌ని.. హామీల‌ను అట‌కెక్కించేశార‌ని.. రేపు హుజురాబాద్‌కూ ఇదే గ‌తి ప‌డుతుందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్ట‌డానికే ఆయ‌న స‌డెన్‌గా సాగ‌ర్ టూర్ వేశార‌ని అంటున్నారు. అయినా, ఒక్క ప‌ర్య‌ట‌న‌తో త‌ప్పుల‌న్నీ తుడిచిపెట్టుకుపోతాయా? సీఎం కేసీఆర్‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న అనుమానాలు అంత ఈజీగా తొల‌గిపోతాయా?