న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నారా? మంత్రి నాని వ్యాఖ్యల అర్థమేంటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తినిండా కోర్టులు మొట్టిన మొట్టికాయలే.. ఎన్నెన్ని కేసుల్లో న్యాయస్థానాలు వైసీపీ ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టాయో.. ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ విరుద్ద నిర్ణయాల విషయంలో న్యాయస్థానాలు సర్కార్ నెత్తిన ఎన్నిమార్లు అక్షింతలు వేశాయో లెక్క లేదు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం మొదలు.. అనేక విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాల తీర్పులతో వెనక్కి తీసుకుంది. అందుకోసంగా, వందల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అంతే కాదు, ప్రభుత్వ పెద్దల తప్పులకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇతర అధికారులు కోర్టు బోనులో నిలబడి క్షమాపణలు కోరవలసి  వచ్చింది. అయినా కుక్క తోక వంకర అన్నట్లుగానే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. న్యాయవ్యవస్థతో కయ్యానికి కాలు దువ్వుతూనే వుంది. మఖ్యమంత్రి జగన్ రెడ్డి కనిపెట్టిన రివర్స్ పీఆర్సీ విషయంగా, ఉద్యోగ సంఘాల ఆందోళన ఉదృతం వుతున్న వేళ, ఈ విషయంలో మరోమారు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం అనివార్యం అని గ్రహించిన ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు మరోసారి న్యాయవ్యవస్థను టార్గెట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో ముందుండే మంత్రి పేర్నినానీ, సమయ సందర్భాలతో సంబంధం లేకుండా, ‘తప్పు చేస్తే జడ్జిలనుకూడా వదలబోమంటూ’ న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

అంతే కాదు, న్యాయ వ్యవస్థను, సినిమా, రాజకీయ వ్యవస్థలతో కలిపి ఒకే గాటన కట్టేస్తూ తప్పు చేస్తే, న్యాయమూర్తులానే కాదు రాజకీయ పార్టీలను, పార్టీలు పెట్టిన సినీ నటులనూ వదలబోమంటూ హెచ్చరిక చేశారు. సినిమా  నటులను, రాజకీయ నాయకులను హెచ్చరించారంటే అర్థం చేసుకోవచ్చును, కానీ, న్యాయమూర్తులను హెచ్చరించడం, అది కూడా ఒక మంత్రి అలాంటి హెచ్చరికలు చేయడం ఎంతవరకు సమంజసం... అనేది న్యాయవ్యవస్థే  నిర్ణయించాలని అంటున్నారు. 

అయితే, మంత్రి పేర్నినానీ, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? ఎందుకు చేశారు? అనేది పక్కన పెడితే,  అసలు న్యాయవ్యవస్థ గురించి పేర్ని నాని, ఈ సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్’లో హాట్ టాపిక్‌గా మారుతోంది. నిజానికి, న్యాయ వ్యవస్థ ఆసు పసులు తెలిసిన ఎవరికైనా న్యాయవ్యవస్థ ప్రభుత్వాలకు లోబడి ఉండదు, అనే విషయం కూడా తెలిసే ఉంటుంది. న్యాయమూర్తులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేవు అనేది కూడా తెలిసే ఉంటుంది. పేర్ని నానీ మంత్రి కూడా కాబట్టి ఆయనకు కూడా ఈ విషయం తెలియదని అసలే అనుకోలేము. అయినా, ఆయన నేరుగా న్యాయమూర్తులనే హెచ్చరించారంటే, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలతోనే కాకుండా  వ్యవస్థలతోనూ కయ్యానికే సిద్డంవుతోందని అర్థం చేసుకోలసి ఉంటుందని అంటున్నారు. 

పీఆర్సీతో పాటుగా ఇతర సమస్యల విషయంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉమ్మడి ఆందోళనను, ఎదురు దాడితో ఎదుర్కోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ఈ అసందర్భ ప్రకటన చేయడంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా ఓ ప్రణాళిక ఉండే ఉంటుందని, రాజకీయ వర్గాలు అనుమనిస్తున్నాయి.
  
గతంలోనూ వైసీపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కయ్యానికి కాలు దువ్వింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘర్షణకు సిద్ధమవుతోందని, ఇందుకు మంత్రి వ్యాఖ్యలు సంకేతమని అంటున్నారు. అయితే, అటు ఉద్యోగులతో, ఇటు న్యాయవ్యవస్థతో పెట్టుకున్నవారు ఎవరైనా అంతిమంగా అభాసుపాలు కాక తప్పదని చరిత్ర చెపుతున్న పాఠం. జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం అందుకు మినహాయింపు కాదు అంటున్నారు గత చరిత్రకు సాక్షిగా నిలిచిన రాజకీయ విశ్లేషకులు.