అమ‌ర‌రాజాపై అన్నీ కుట్ర‌లేనా? అస‌లక్క‌డ ఏం జ‌రుగుతోంది? రియాల్టీ చెక్‌..

తిరుప‌తి స‌మీప క‌ర‌కంబాడిలో 36 ఏళ్లుగా అమ‌ర‌రాజా ఉంది. ద‌శాబ్దాలుగా ఎవ‌రికీ ఏ స‌మ‌స్యా లేదు. స‌డెన్‌గా జ‌గ‌న్ స‌ర్కారుకే కాలుష్యం గుర్తుకొచ్చింది. ఇక్క‌డి నేల‌, నీరు, గాలి పొల్యూట్ అవుతున్నాయ‌ని.. వెంట‌నే ఫ్యాక్ట‌రీ మూసేయాల‌ని ఆదేశించింది. ఆ ఆర్డ‌ర్స్ చూసి.. 'అవునా'.. అంటూ అంతా ఆశ్చ‌ర్యం. ఇదేమీ చోద్యం అంటూ ఆగ్ర‌హం. ఎందుకంటే అబ‌ద్దం అలాంటిది మ‌రి. అమ‌ర‌రాజా వ్య‌వ‌స్థాప‌కులు  గ‌ల్లా రామ‌చంద్రనాయుడు కుటుంబం ఫ్యాక్ట‌రీ ఆవ‌ర‌ణ‌లోనే నివ‌సిస్తోంది. అంతా ఆరోగ్యంగా, కులాసాగానే ఉన్నారు. అంత కాలుష్య‌మే ఉంటే.. కంపెనీ ఓనర్లు అక్క‌డే ఎందుకు ఉంటారు చెప్పండి. ఈ చిన్న‌ లాజిక్ జ‌గ‌న్ స‌ర్కారుకు అర్థంకావ‌డం లేదా? లేక‌, అంతా అర్థ‌మ‌య్యే, అక్క‌డ ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేద‌ని తెలిసే.. కావాల‌నే ఇలా చేస్తున్నారా? 

అమ‌ర‌రాజా ఫ్యాక్టరీ ఆవరణలో సిబ్బంది కోసం 375 క్వార్టర్స్‌ ఉన్నాయి. వాటిలో సుమారు 2వేల మంది ఉంటున్నారు. ఇదే ప్రాంగణంలో సంస్థ యాజమాన్యం హైస్కూలు నిర్వహిస్తోంది. ఉద్యోగుల పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కలిపి 990 మంది చదువుకుంటున్నారు. అక్క‌డ కాలుష్యం లేద‌న‌డానికి ఇంత‌కంటే ఆధారం ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే.. 

అమరరాజా బ్యాటరీస్‌ ప్రధాన ప్లాంటు తిరుపతికి బాగా సమీపంలోని కరకంబాడిలో ఉంది. కంపెనీ సమీపంలో కరకంబాడి, తారకరామా నగర్‌, దొడ్లమిట్ట, ఇందిరానగర్‌, రాజీవ్‌గాంధీ కాలనీ, గొల్లపల్లె గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 20వేల మంది వ‌ర‌కూ నివ‌సిస్తున్నారు. వీరిలో ఎవ‌రూ కూడా కంపెనీ కాలుష్యం వ‌ల్ల అనారోగ్యం పాలైన‌ది లేదు. ప్ర‌భుత్వం మాత్రం కరకంబాడిలోని ప్లాంటు కారణంగా గాలి, నీరు, భూమిలో 'లెడ్‌' స్థాయికి మించి ఉందంటోంది. అదే నిజ‌మైతే.. అధిక మోతాదు లెడ్ వ‌ల్ల ఒక్క‌రైనా ఆసుప‌త్రి పాల‌య్యే వారుగా? మ‌రి, అలాంటి కేసు ఒక్క‌టున్నా బ‌య‌ట‌పెట్ట‌మంటూ స‌వాల్ విసురుతున్నారు స్థానికులు. అమ‌ర‌రాజాపై రాజ‌కీయ క‌క్ష్య‌తోనే కాలుష్య‌మంటూ పీసీబీతో కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆ పీసీబీ అధికారులు ఎప్పుడు వ‌చ్చారో.. స్థానిక గ్రామాల్లో ఎలాంటి ప‌రిశీల‌నలు చేశారో.. ఎవ‌రిని ప్ర‌శ్నించారో.. ఎవ‌రి నుంచి ర‌క్త‌ న‌మూనాలు సేక‌రించారో.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ తెలీని చిదంబ‌ర ర‌హ‌స్యం. 

ఇక‌, ప్ర‌జ‌ల‌తో పాటు ఫ్యాక్టరీ సమీపంలోని పంటపొలాలు కూడా చక్కగా ఉన్నాయి. అంటే గాలి, నీటి కాలుష్యం లేద‌నేగా అర్థం? పోనీ, స్థానికులెవ‌రైనా ఫిర్యాదు చేశారా? అమ‌ర‌రాజాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు జ‌రిగాయా? ప‌ర్యావ‌ర‌ణ సంస్థ‌లేవైనా ఆందోళ‌న చేశాయా? మ‌రెందుకు ఇంత‌టి ఓవ‌రాక్ష‌న్ అంటూ నిల‌దీస్తున్నారు స్థానిక ప్ర‌జ‌లు. 

ఇది.. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా అమరరాజా గ్రూప్‌కు లభించిన సర్టిఫికెట్‌. గత ఏడాది ఫోర్బ్స్‌, స్టాటిస్టికా సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలకు చెందిన లక్షన్నర మంది ఉద్యోగులు/కార్మికులను ప్రశ్నించి... తాము పని చేస్తున్న సంస్థ ప్రతిష్ఠ, విశ్వసనీయత, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీతో అందించే సేవ, స్వభావం, అందుతున్న ప్రయోజనాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. సుమారు 50 లక్షల డాటా పాయింట్స్‌ను విశ్లేషించి ఆయా సంస్థలకు ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఇందులో.. అమరరాజా గ్రూప్‌ను ‘ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థ’లలో ఒకటిగా గుర్తించింది. అమరరాజాకు ప్రపంచస్థాయిలో 316 ర్యాంకు రావడం విశేషం. ఈ జాబితాలో భారత్‌కు చెందిన రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ వంటి అతికొద్ది కంపెనీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.

ఇంత‌టి గొప్ప కంపెనీ ఏపీలో ఉన్నందుకు, వేలమందికి ఉపాధి క‌ల్పిస్తున్నందుకు, ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి వేల కోట్ల రాబ‌డి అందిస్తున్నందుకు గ‌ర్వ‌ప‌డ‌దామా? లేక‌, కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ వారు కాబ‌ట్టి ఇంత‌టి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు తెగ‌బ‌డ‌తామా? జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న‌ దుర్నీతితో అమ‌ర‌రాజాలాంటి ప్ర‌పంచ స్థాయి కంపెనీ ప‌క్క రాష్ట్రానికి త‌ర‌లిపోయేందుకు సిద్ధ‌మ‌వ‌డం నిజంగా ఆంధ్రుల దుర‌దృష్ట‌మే. జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇలాంటి దుష్ఫ‌లితాలెన్నో అనుభ‌వించాల్సిందే..  అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారంతా.