సినిమాల కోసం అవసరమైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపీ
posted on Oct 13, 2025 2:46PM

సినిమా నటులు రాజకీయాలలోకి రావడం అరుదేం కాదు. అయితే రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తనకు రాజకీయాల కంటే సినిమాలే ముఖ్యం అంటూ యూటర్న్ తీసుకోవడం చాలా చాలా అరుదు. అందులోనూ సినిమాల కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధం అనడం అంటే.. అది అసలు ఊహకు కూడా అందని విషయం.
అలాంటి ఊహకందని వ్యాఖ్యలు చేశారు ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రపెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ. రాజకీయాలలో ఉండటం, కేంద్ర మంత్రిగా పదవిలో ఉండటం తనకేమీ సంతృప్తి ఇవ్వడం లేదన్నారు సురేష్ గోపీ. సినీ కెరీర్ ను వదిలిపెట్టి రాజకీయాలలోకి రావాలని కానీ, కేంద్ర మంత్రి కావాలని కానీ తాను ఎన్నడూ అనుకోలేదని సురేష్ గోపీ చెప్పుకొచ్చారు. అయినా రాజకీయాలలోకివచ్చి కేంద్ర మంత్రిని అయ్యాననీ, కానీ అప్పటి నుంచీ తనకు చేతిలో డబ్బులు ఆడటంలేదనీ, ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం మళ్లీ సినిమాలలో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను సినిమాలలో నటించడానికి కేంద్ర మంత్రి పదవి అడ్డంకి అయితే.. ఆ పదవిని తృణ ప్రాయంగా త్యజిస్తానని చెప్పారు. అదే జరిగి ఒక వేళ తానురాజీనామా చేస్తే.. తాను వదిలేసే మంత్రి పదవిని తన రాష్ట్రానికే చెందిన అంటే కేరళకు చెంది రాజ్యసభ సభ్యుడు సదానంద్ మాస్టర్ కు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు.
సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సురేష్ గోపీ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో త్రిసూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో స్థానం పొందారు. అయితే రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. తన పిల్లలు ఇంకా సెటిల్ కాలేదనీ, ఈ పరిస్థితుల్లో తనకు ఆదాయం చాలా అవసరమన్న ఆయన.. అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందు కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని వదిలేయడానికైనా సిద్ధమన్నారు.