తెలంగాణలో విలీనమా.. నెవర్.. ఎవర్! కేసీఆర్ పై రాయచూర్ ఎమ్మెల్యే ఫైర్..

మొన్న మంత్రి కేటీఆర్... ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ .. తెలంగాణ సరిహద్దు జిల్లాల పొరుగు రాష్ట్రం ప్రజలు, నాయకులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణలో జరుగతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి, ముర్సి పోయి, ముచ్చటపడి తమ ప్రాంతాలను తెలంగాణాలో విలీనం చేయాలని వేడుకుంటున్నారని చెప్పుకున్నారు. ఒకరు ట్విట్టర్ లో ఇంకొకరు పార్టీ వేదిక నుంచి రెండు రూపాల్లో చెప్పుకున్నారు. అంతేకాదు  అది తెలంగాణ సాధించిన విజయానికి సంకేతమని చెప్పు కొచ్చారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నిపార్టీలు అయిపోయి చివరకు పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటకలోని  రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను తమ జిల్లాలోనూ అమలు చేయాలని లేదంటే, తమజిల్లాను తెలంగాణలో విలీనం చేయాలని, కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందర్భంలో కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర బీజేపీ నాయకులవరకూ ఏ ఒక్కరూ కూడా అలాంటి ముచ్చట ఏదీ తమ దృష్టికే రాలేదని అదొక పచ్చి అబద్ధమని కుండ బద్దలు కొట్టారు. కేటీఆర్ కు కాసిన్ని చీవాట్లు కూడా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారు, తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, పొరుగు రాష్ట్రం ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, అవ్వన్నీ తుడిచేసుకుని, మళ్ళీ  మోత్కుపల్లి గులాబీ ‘తీర్థం’ పుచ్చుకున్న వేడుక సభలో కాసింత మసాల జోడించి మళ్ళీ అదే  రికార్డు కేసీఆర్ రీ ప్లే చేశారు. అయితే, ఈ సారి, రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, ‘తెలుగు వన్’తో ఫోన్లో మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి, భ్రమల్లో ఉన్నారని, తెలంగాణాలో కంటే రాయచూర్ ప్రజలు సంతోషంగా ఉన్న వాస్తవం ఆయన ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంట మంచిదని అన్నారు. రాయచూర్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5600 కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు.

ఒక్క ఎయిమ్స్ విషయంలో హైదరాబాద్లో లాగా రాయచూర్ లోనూ ఎయిమ్స్ఏర్పాటు చేయాలని మాత్రమే తాను కోరానని, అది పట్టుకుని కేసీఆర్, కేటీఆర్ కథలు అల్లుకుని పగటి కలలు కంటున్నారని పాటిట్ చురకలేశారు.  అలా భ్రమల్లో మునిగి తేలుతూ చిలువలు పలువులు అల్లుకుని అపోహలు పోతున్నారని అన్నారు. అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని చురకలు వేశారు. రాయచూర్ ప్రజలు కనడ ఆత్మగౌరవాన్ని చంపుకుని ... తెలంగాణ కలవాలని నెవెర్ ..ఎవర్  ఎప్పుడూ కోరరు  ..కోరుకోరు  ..అని పాటిల్ కుండ బద్దలు కొట్టారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసత్యాలు పలకడం మంచిది కాదని పాటిల్ మెత్తగా పెట్టారు.